కిరణ్ అబ్బవరం హీరోగా సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క’. దీపావళి కానుకగా అక్టోబర్ 31న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తా అని చాలా నమ్మకంగా ఉన్నాడు కిరణ్ అబ్బవరం. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లోని ముఖ్యమైన పాయింట్స్ మీ కోసం కొన్ని
Q : ఈ సినిమా ఎప్పుడు మొదలైంది?
కిరణ్: 2022లో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ విడుదలకు ఒక నెల ముందు ఈ కథ ఓకే చేశా. అప్పటి నుండి ఈ సినిమా కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పక్కాగా రెడీ చేసాక షూట్ స్టార్ట్ చేసాం. ప్రేక్షకులు తప్పకుండా నన్ను కొత్తగా చూస్తారు.
Q : ఈ సినిమా కథ ఎలా ఉంటుంది?
కిరణ్: కథ విన్నప్పుడు చివరి 20 నిమిషాలు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇలాంటి పాయింట్ ఇంత వరకు రాలేదు, ఎవరూ చెప్పలేదు అని అనిపించింది. ఖచ్చితంగా సినిమా పూర్తయ్యే లోపు ప్రేక్షకులు తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతారు. ఇది కంటెంట్ బేస్డ్ సినిమా.’
Q : ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందా..?
కిరణ్: అలా ఏమి లేదు. వాసుదేవ్ అనే వ్యక్తి ప్రయాణంపై ఈ కథ ఉంటుంది. వాసుదేవ్ అనే వ్యక్తి ఒక అనాథ. పక్కవారి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అందుకే వేరే వాళ్ల ఉత్తరాలు చదువుతుంటాడు. పోస్ట్‌మ్యాన్ అయ్యాక కృష్ణగిరి వెళ్తాడు. అక్కడ అసలు ఏం జరిగిందనేది మిగతా కథ.
Q : మీ ట్రైలర్ చూసినప్పుడు కాంతార మేకింగ్ స్టైల్ అనిపించింది.
కిరణ్: కొంచం నైట్ షాట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా. అందుకే మీకు అలా అనిపించి ఉండొచ్చు. ఇందులో ఎలాంటి భక్తి సంబంధమైన సీన్స్ ఉండవు. ఈ సినిమా కేవలం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే.
Q : ట్రైలర్‌లో ఒక వ్యక్తి ముసుగు వేసుకుని కనిపించారు.ఎవరతను..?
కిరణ్: అది సినిమాలో కీలకమైన ట్విస్ట్. ఇప్పుడు చెప్పలేము. కానీ నేను మాత్రం కాదు. నేను ద్విపాత్రాభినయం చేయలేదు.
Q : మీకు ఇతర భాషలలో రిలీజ్ కు థియేటర్లు దొరికాయా?
కిరణ్: ఈ సినిమా దీపావళికి తెలుగులో మాత్రమే విడుదల అవుతుంది. మిగిలిన భాషల్లో ఆ రోజు రిలీజ్ చేయడం లేదు. మలయాళంలో దుల్కర్ సల్మాన్ మూవీ రిలీజ్ ఉంది. అందువల్ల ఆ సమయంలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. తమిళంలో మాకు థియేటర్స్ దొరక లేదు. అందుకే తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నాం.
Q : ఈ సినిమాతో మీరు పాన్ ఇండియా హీరో అవుతారా?
కిరణ్: మా సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చితే చాలు. పాన్ ఇండియా హీరో అవుతానా? అన్ని భాషల్లో ప్రేక్షకులు ఆదరిస్తారా? అనేది తర్వాత విషయం. ఫలితం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.