మామూలుగా రొమాంటిక్ ఇమేజ్ ఉన్న హీరోలు గుండెలోని ప్రేమ గురించి డైలాగులు చెబుతుంటారు. కానీ, బాలీవుడ్ లవ్వర్ బాయ్ కార్తీక్ ఆర్యన్ మరో విధంగా గుండె గురించి ప్రస్తావించాడు. ప్రతీ ఏటా చాలా మంది కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణిస్తుంటారని చెప్పిన ఆయన కేవలం ఒక గంట పాటూ ఆన్ లైన్ వర్క్ షాప్ కి అటెండ్ అయితే మనం చాలా మందిని మృత్యువు నుంచీ కాపాడవచ్చని అన్నాడు. ఎవరికైనా గుండెపోటు వస్తే హాస్పిటల్ కి తీసుకు వెళ్లే లోపు చేయాల్సిన ప్రాథమ చికిత్స లాంటి పనుల్ని డాక్టర్లు ‘సీపీఆర్’ అంటారు. కార్డియక్ అరెస్ట్ నుంచీ మన తోటి వార్ని కాపాడటానికి ఈ సీపీఆర్ టెక్నిక్స్ ఎంతో అవసరం. కార్తీక్ ఆర్యన్ దానిపై అవగాహన కల్పించేందుకు నడుం బిగించాడు…
ఇప్పటికి ఎంతో మంది కార్డియాక్ అరెస్ట్ ద్వారా మరణించటం చూసిన ఎందరో హృద్రోగ నిపుణులు సీపీఆర్ పై అవగాహన కల్పించేందుకు వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. అందులో మీరూ జాయిన్ అవ్వండి. కొన్ని దేశాల్లో 15 ఏళ్లు పై బడిన ప్రతీ వారికీ సీపీఆర్ లో శిక్షణ ఇస్తారు. మనమూ త్వరలోనే అటువంటి స్థితికి చేరుకోవాలి. మనం తప్పకుండా ఆ పని చేయగలం అంటూ కార్తీక్ నెటిజన్స్ కు పిలుపునిచ్చాడు.
పోయిన సంవత్సరం కూడా కరోనా కల్లోలం తొలి దశలో కార్తీక్ రకరకాలు అవగాహన కల్పించాడు. కరోనా విషయంలో డూస్ అండ్ డోంట్స్ అంటూ చాలా విషయాలు మామూలు జనానికి అర్థమయ్యేలా సరళంగా వివరించాడు. ఇప్పుడు సీపీఆర్ నేర్చుకొమ్మంటూ తనవంతు సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. ఇది తప్పక మెచ్చుకోవాల్సిన ప్రయత్నమే!