కర్ణాటక సినీ -సాంస్కృతిక కార్మికుల సంక్షేమం బిల్లు 2024 జూలై 19న శాసన సభలో ప్రవేశ పెట్టబడింది. ఆ సమయంలో కర్ణాటక ప్రభుత్వం సినిమా టిక్కెట్లు, OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్ ఫీజుపై 2% సెస్ విధించాలని యోచిస్తోంది. సినీ, సాంస్కృతిక కళాకారులకు మేలు జరిగే విధంగా పన్ను వసూలు చేయనున్నారు. కళాకారులకు మేలు చేయడమే ఈ బిల్లు ఉద్దేశం అని చెబుతున్నారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు అలాగే ఇతరులు ఈ ఫండ్‌లో భాగం అవుతారు. దీంతో పాటు థియేటర్‌లో ఉన్న వారికి కూడా రానున్న కాలంలో ఈ బిల్లు వలన బెనిఫిట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని సినీ, సాంస్కృతిక కార్యకర్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు ‘కర్ణాటక సినీ, సాంస్కృతిక కార్యకర్తల సామాజిక భద్రత & సంక్షేమ నిధి’ పేరుతో ఒక నిధిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం బిల్లును ప్రతిపాదించింది.
ఈ బిల్లు ప్రకారం, రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ఆదాయం, చందా రుసుములపై సినీ, సాంస్కృతిక కార్యకర్తల సంక్షేమ సెస్ విధించబడుతుంది. ప్రభుత్వం సూచించిన విధంగా సెస్ 1 నుండి 2 శాతం వరకు ఉంటుంది. అలాగే, మూడేళ్లకు ఒకసారి రేట్ల సవరణ జరుగుతుంది. “ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారం సెస్ విధించబడుతుంది. సినిమా టిక్కెట్లు మరియు సబ్‌స్క్రిప్షన్ ఫీజులతో పాటు సంబంధిత సంస్థల నుండి వచ్చే మొత్తం ఆదాయంపై 2 శాతానికి మించకుండా, 1 శాతానికి తక్కువ కాకుండా సెస్ విధించబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన సెస్ కర్ణాటక సినీ మరియు సాంస్కృతిక కార్మికుల సంక్షేమ బోర్డుకు బదిలీ చేయబడుతుంది. ఈ బోర్డులో ఇన్‌ఛార్జ్ మంత్రి, కార్మిక శాఖ, లేబర్ డిపార్ట్‌మెంట్ కమిషనర్, అడిషనల్ చీఫ్ సెక్రటరీ/ప్రిన్సిపల్ సెక్రటరీ/సెక్రటరీ, సినీ లేబర్ ఉంటారు. ప్రభుత్వం నామినేట్ చేసిన 7 మంది సభ్యులు ఉంటారు.
ప్రభుత్వం ఆమోదించిన కర్ణాటక ఫోక్ అకాడమీ, కర్ణాటక ఫిల్మ్ అకాడమీ, కర్ణాటక నాటక అకాడమీ, కర్ణాటక సంగీత నృత్య అకాడమీ, కర్ణాటక యక్షగాన అకాడమీ, కర్ణాటక బయలాట అకాడమీ, కర్ణాటక ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా గుర్తింపు పొందిన సినీ & సాంస్కృతిక కార్యకర్తలు ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. ప్రస్తుత పరిస్థితులతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేక సినిమా వాళ్ళు కష్టాలు పడుతున్నారు. ఇక మల్టీప్లెక్స్‌ల సంఖ్య దృష్ట్యా హౌస్‌ఫుల్ షోలు చూడడం కష్టమే. అంతేకాకుండా ఇప్పటికే చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడు ఈ సెస్ వల్ల టికెట్ ధర ఏమాత్రం ఎక్కువైనా సినిమా థియేటర్ కు ప్రేక్షకులు రావడం కష్టమే అని చెప్పొచ్చు.