మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. సీనియర్ నటులు సుమన్, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, యంగ్ జోడీ వరుణ్ సందేశ్, వితికా షేరు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ ఈ పొలిటికల్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. నూతన సంవత్సర కానుకగా చిత్ర యూనిట్ ఈ సినిమా ‘ఫస్ట్ లుక్ పోస్టర్’ను విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శకుడు మరియు సాంకేతిక నిపుణులు పంచుకున్నారు. దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ, “ఇది కేవలం రాజకీయాల చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదు, బలమైన భావోద్వేగాలు కలిగిన చిత్రం. సాయికుమార్, సుమన్ వంటి దిగ్గజ నటులతో పనిచేయడం సంతోషంగా ఉంది. అలాగే వరుణ్ సందేశ్, వితికా షేరుల నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఉత్కంఠ భరితమైన కథనంతో సినిమాను మలిచాం” అని తెలిపారు.
ఈ చిత్రానికి సాహిత్య దిగ్గజం చంద్రబోస్ అద్భుతమైన పాటలు అందించారు. ఆ పాటలకు ప్రముఖ గాయని సునీత తన మధురమైన గొంతును అందించడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్ సినిమాలో మ్యూజికల్ హైలైట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, పృథ్వి, శివ వంటి అనుభవం ఉన్న నటీనటులు ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగంగా దూసుకుపోతున్న ఈ సినిమాను అన్ని హంగులతో ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వెంకట హనుమ సినిమాటోగ్రఫీ, సాయిబాబు తలారి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, నందు మాస్టర్ ఫైట్స్ సమకూర్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో విడుదలైన ఈ ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.