బెట్టింగ్ మరియు గేమింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో తెలంగాణ సీఐడీ (CID) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, నటి అమృత చౌదరి సీఐడీ అధికారుల ఎదుట హాజరై విచారణ ఎదుర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ ముగ్గురు ప్రముఖులు సీఐడీ సిట్ (SIT) ఎదుట హాజరయ్యారు. సీఐడీ అధికారులు ముగ్గురిని గంటకుపైగా ప్రశ్నించారు. ఏయే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారు, అందుకు ఎంత మొత్తంలో పారితోషికం తీసుకున్నారు అనే అంశాలపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
Also Read : Nidhhi Agerwal: సీఐడీ విచారణకు హాజరైన హీరోయిన్ నిధి అగర్వాల్!
విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు గుర్తించిన బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల వివరాలు: నిధి అగర్వాల్, జీత్ విన్ (Jeet Win) బెట్టింగ్ సైట్. శ్రీముఖి M 88 బెట్టింగ్ యాప్. అమృత చౌదరి Yolo 247, ఫెయిర్ ప్లే Fair Play బెట్టింగ్/గేమింగ్ యాప్. ఇక యాంకర్ శ్రీముఖిని అధికారులు గంటపాటు ప్రశ్నించారు. ఆమె ఏఏ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారనే దానిపై ప్రధానంగా దర్యాప్తు జరిగింది. కాగా, శ్రీముఖి గతంలో ఇదే తరహా కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణను కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఆర్థిక లావాదేవీలు, మోసాలకు పాల్పడిన కేసులో దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంలో మరింత మంది సినీ, టీవీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సీఐడీ వర్గాలు వెల్లడించాయి.