విశ్వనటుడు కమల్ హాసన్ తర్వాత డిఫరెంట్ గెటప్స్ వేసి మెప్పించగలిగే తమిళ నటుడు చియాన్ విక్రమ్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కోబ్రా చిత్రంతోనూ మరోసారి విక్రమ్ తన నట విశ్వరూపం చూపడానికి సిద్ధమౌతున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే తిరిగి మొదలు కాబోతోందనే విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెలిపారు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో విక్రమ్ కు మేకప్ వేస్తున్న ఓ స్టిల్ ను ఆయన పోస్ట్ చేస్తూ… షూటింగ్ కోసం ఇక ఎంత మాత్రం ఆగలేం అని పేర్కొన్నారు. విశేషం… ఏమంటే ఈ ఫోటోలోని విక్రమ్ ను చూస్తుంటే… మరోసారి ఆయన ఆ పాత్ర కోసం ప్రాణం పెడుతున్నట్టుగా అర్థమౌతోంది. ఆ మధ్య వచ్చిన మల్లన్న సినిమాలోనూ ఇలానే విక్రమ్ ఆరేడు డిఫరెంట్ గెటప్స్ ను వేశారు. ఇప్పుడు మరోసారి అదే తరహాలో ఇంకొన్ని భిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న కోబ్రాతో పాటు విక్రమ్ మరో రెండు మూడు ప్రతిష్ఠాత్మక చిత్రాలలోనూ నటిస్తున్నాడు. విక్రమ్ తన 60వ చిత్రాన్ని కొడుకు ధృవ్ తో కలిసి చేయబోతున్నాడు. దీనికి కార్తిక్ సుబ్బరాజు దర్శకుడు. దీనితో పాటే గౌతమ్ మీనన్ ధృవ నక్షత్రం, మణిరత్నం పొన్నియన్ సెల్వన్ చిత్రాలూ అదే వరుసలో ఉన్నాయి. కోబ్రా చిత్రాన్ని వైకామ్ స్టూడియోస్ తో కలిసి సెవన్ స్క్రీన్ స్టూడియోస్ కు చెందిన లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.