ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ రహస్యంగా తన బాయ్‌ఫ్రెండ్ సామ్ అస్‌ఘరిని పెళ్లి చేసుకుంది. అయితే తన పెళ్లి వేడుక లాస్ ఏంజిల్స్‌లో బ్రిట్నీ స్పియర్స్ చేసుకుంది. అయితే ఈ పెళ్లిని అడ్డుకునేందుకు స్పియర్స్ మాజీ భర్త అలెగ్జాండర్ విఫలయత్నం చేశాడు. 2004లో జేసన్ అలెగ్జాండర్‌ను బ్రిట్నీ పెళ్లాడింది. కానీ ఆ జంట కేవలం 55 గంటలు మాత్రమే కలిసి ఉండటం గమనార్హం. గతంలో కూడా బ్రిట్నీ స్పియర్స్ పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో.. అలెగ్జాండర్ అడ్డుకునేందుకు యత్నించాడు. అయితే గురువారం పెళ్లి వేదిక వద్దకు తోసుకువెళ్లేందుకు అలెగ్జాండర్ ప్రయత్నించగా.. ఆ సమయంలో అక్కడ ఉన్న వెంచురా కౌంటీ పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘ఆమె నా తొలి భార్య, నాకున్న ఏకైక భార్య’ అంటూ అలెగ్జాండర్ పోలీసుల ముందు అరిచినట్లు సమాచారం.
వెడ్డింగ్ కోసం తనకు ఆహ్వానం ఉందని చెప్పినా పోలీసులు వినిపించుకోకుండా తనను అడ్డగించారు. 40 ఏళ్ల పాప్ స్టార్ బ్రిట్నీ స్పియర్స్ ఇటీవలే సంరక్షణ కేసు నుంచి బయటపడిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల పాటు ఆమె తండ్రి సంరక్షణలోనే ఉన్నారు. సంరక్షణలో ఉండడం వల్ల పెళ్లి చేసుకోలేకపోతున్నానని, పిల్లల్ని కనలేకపోతున్నట్లు బ్రిట్నీ ఓ సందర్భంలో వెల్లడించింది. పర్సనల్ ట్రైనర్ అస్‌ఘరితో 2016లో స్పియర్స్‌కు పరిచయం ఏర్పడి.. స్లంబర్ పార్టీ మ్యూజిక్ ఆల్బమ్ రూపొందిస్తున్న సమయంలో ఆ ఇద్దరూ స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి పీటలెక్కారు.