తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు హీరోగా నటించిన చిత్రం ‘మండేలా’. ఈ పొలిటికల్ సెటైరికల్ మూవీ సరిగ్గా తమిళనాడు అసెంబ్లీ పోలింగ్ కు ఒక రోజు ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. అలానే టీవీలోనూ ప్రదర్శితమైంది. పదవిని దక్కించుకోవడం కోసం రాజకీయ నేతలు చేసే కుతంత్రాలన్నింటినీ ఈ సినిమాలో దర్శకుడు అశ్విన్ కళ్ళకు కట్టినట్టు చూపించారు. అప్పటి వరకూ ఊరిలో ఎవరికీ పట్టని ఓ బార్బర్ ఒక్కసారిగా ఓటు హక్కు సంపాదించుకోవడం, అతని ఓటే ఎన్నికల్లో కీలకం కావడంతో అతనికి ఎలాంటి ఆశలు చూపించి, నేతలు తమ బుట్టలో వేసుకోవాలనుకున్నారో సినిమాలో తెలిపాడు. ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పుడే దీన్ని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనే ఆలోచన చాలామందికి కలిగింది. కొందరు యోగిబాబు పాత్రకు సంపూర్ణేశ్ బాబు బాగుంటాడని భావిస్తే, మరికొందరి మనసులో సునీల్ మెదిలాడట. తాజాగా ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత అనిల్ సుంకర సొంతం చేసుకున్నారు. అయితే ఈ సినిమాకు తొలుత నటుడు, నిర్మాత గణేశ్ ను అనుకున్నారని, అయితే ఇప్పుడు ఆ పాత్ర సునీల్ చేయబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తను గణేశ్ ఖండించారు. అసలు ఆ పాత్ర చేయమని తననెవరూ అడగలేదని స్పష్టం చేశాడు. ఏదేమైనా ఫిల్మ్ నగర్ వార్తలు వింటుంటే… యోగిబాబు పాత్ర సునీల్ చేసే ఆస్కారమే కనిపిస్తోంది. అయితే… సునీల్ ఇమేజ్ కు తగ్గట్టు ఆ పాత్రను కాస్తంత పోష్ గా చూపించే ఆస్కారం లేకపోలేదు. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.