వేశ్యలు అంటే ప్రతి ఒక్కరికి చిన్న చూపు. కారణం లేకుండా ఏం జరగదు అని అంటారు. అలా బ్రతకాలి అని ఎవరికి ఉండదు. కానీ పరిస్థితులు అలా మారుస్తాయి. కానీ వాళ్లు మనుషులేనని, వేశ్యలకు కష్టాలుంటాయి అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రమే ‘అనోరా’. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మైకీ మాడిసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను సీన్ బేకర్ తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ ఏడాది ఐదు ఆస్కార్ ఆవార్డులను సొంతం చేసుకున్న ఈ మూవీ చరిత్ర సృష్టించింది.
దీంతో తెలుగు ప్రేక్షకులకు ఈ మూవీ పై ఆసక్తి మొదలైంది. ఇక ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉండగా, ఇప్పుడీ మూవీ సోమవారం నుంచి ప్రముఖ ఓటీటీ జియో హాట్‌స్టార్ లో ఇంగ్లిష్, హిందీ భాషల్లో రెంట్ లేకుండా చూడొచ్చు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా జియో హాట్‌స్టార్ సంస్థ స్వయంగా ప్రకటించింది. అయితే అసలు ఈ మూవీ కథ ఏంటీ అంటే.. వేశ్య వృత్తిలో ఉండే ‘అని’ అనే యువతిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు రష్యాకు చెందిన వన్య అనే ఓ యువరాజు. ఈ విషయం తెలుసుకున్న ఆ యువరాజు తల్లిదండ్రులు వారిద్దరిని వేరు చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారు ఎలాంటి సవాళ్లు ఎదుర్కోన్నారు అనేది ఈ సినిమా కథాంశం. ఇక వేశ్యల జీవితాల్ని మానసిక సంఘర్షణను తెరపై చూపించి, ఆస్కార్ ఆధిపత్యం చెలాయించిన ఈ చిత్రాన్ని మీరు చూసేయ్యండి.