‘వై దిస్ కొలవరి డీ’ పాటతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నాడు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. పిన్న వయసులోనే సూపర్ స్టార్ రజనీకాంత్, పవన్ కళ్యాణ్, ధనుష్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాలకు సంగీతాన్ని సమకూర్చాడు. అయితే ఇంతవరకూ సౌత్ కే ప్రాధాన్యమిస్తూ వచ్చిన అనిరుధ్ త్వరలో బాలీవుడ్ బాట పట్టబోతున్నాడట. ప్రముఖ దర్శక నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్ చిత్రాలలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అతను తెరకెక్కించిన ‘తను వెడ్స్ మను’, ‘రాంఝానా’ వంటి చిత్రాలు చూస్తే ఆ విషయం అర్థమౌతుంది. కథానుగుణంగా ఏ సంగీతదర్శకుడైతే దానికి న్యాయం చేస్తాడో ఆలోచించి ఆనంద్ ఎల్ రాయ్ ఎంపిక చేసుకుంటూ ఉంటాడు. అలాంటి ఆనంద్ దృష్టి ఇప్పుడు అనిరుధ్ మీద పడిందట. అతి త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందని తెలుస్తోంది. వీరిద్దరి కలయికలో వచ్చే మ్యూజిక్ ఆల్బమ్ సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆనంద్ ఎల్ రాయ్… అక్షయ్ కుమార్, సారా అలీఖాన్, ధనుష్ తో ‘అత్రంగి రే’ చిత్రాన్ని, ‘రక్షాబంధన్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అలానే నిర్మాతగా ‘హసీన్ దిల్ రుబా’, ‘గుడ్ లక్ జెర్రీ’ చిత్రాలు తీస్తున్నాడు.