సినీ పరిశ్రమలో కార్మికులు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న వివాదం మరోసారి వేడెక్కింది. ఫెడరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, నిర్మాతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాతలు తమకు నచ్చిన సమయాల్లో, తమకు నచ్చిన వారితోనే పని చేయించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, కొందరు నిర్మాతలు సినీ కార్మికుల నైపుణ్యాలను అవమానించే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read : Tollywood strike: కృష్ణానగర్‌లో సినీ కార్మికుల సమ్మె మరింత ముదురుతున్న ఉద్రిక్తత
అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. ‘నిర్మాతలు తమ ఇష్టానుసారం కాల్ షీట్స్ ఇవ్వాలని, మాకు నచ్చిన వారిని తీసుకుంటామని చెబుతున్నారు. ఇలా పనిని నియంత్రించడమే కాకుండా, కొంతమంది కార్మికుల నైపుణ్యాలపై విమర్శలు చేయడం తప్పు’ అని అన్నారు. అలాగే ‘మేము పాత పద్ధతి రూల్స్ ప్రకారం మాత్రమే పని చేస్తామని నిర్మాతలకు స్పష్టంగా చెప్పారు. డాన్స్ ఫైటర్స్, టెక్నీషియన్లకు మాత్రమే వేతన పెంపు ఇవ్వకుండా, వారిని 24 క్రాఫ్ట్స్ నుంచి విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు. ‘సినీ కార్మికులు కడుపు కాలితే వాళ్లే తిరిగి వస్తారని నిర్మాతలు అనుకోవడం అవమానకరం. వేతనాల పెంపు విషయంలో మాత్రం స్కిల్స్ గుర్తొచ్చిందా?’ అని ప్రశ్నించారు. ఇక ఫెడరేషన్ అధ్యక్షుడు అందరు సినీ కార్మికులకు పిలుపునిస్తూ .. ‘నిర్మాతల బుట్టలో ఏ కార్మిక సంఘం పడకూడదు. అందరం ఐక్యతగా కలిసి పోరాడాలి’ అని స్పష్టమైన సందేశం ఇచ్చారు. అలాగే ‘ఇకపై ఏ షూటింగ్స్ జరగవు’ అని కరాకండిగా మాట్లాడారు. ‘నిర్మాత విశ్వప్రసాద్ మాకు నోటీసులు ఎందుకు పంపారో అర్థం కావడం లేదు.. మేము ఛాంబర్‌తో మాత్రమే మాట్లాడతాం.. పీపుల్స్ మీడియా మాకు రూ. 90 లక్షల బకాయి ఉంది. మరి మా వేతనాల పెంపును నిర్మాతలు పెద్ద సమస్యగా ఎందుకు గుర్తించడం లేదు? ఛాంబర్‌తో చర్చలు జరపాలని చిరంజీవి సూచించారు. చిరంజీవి మాతో టచ్ లోనే ఉన్నారు.. మంత్రి కోమటిరెడ్డి కార్మికుల పక్షాన నిలబడ్డారు’ అని తెలిపారు. ఇక రెండు మూడు రోజుల్లో ఏ విషయం మీద క్లారిటీ లేకపోతే కార్మిక సంఘాలన్నీ ఛాంబర్ ని ముట్టడించే అవకాశం ఉంది