భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్దం సద్దుమణిగిన నేపథ్యంలో ఒక్కోక్కరిగా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. మన భారత్ సైనికుల మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ, ప్రాణాలు అర్పించిన వారి పై భావోద్వేగానికి గురవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి ప్రత్యేక పోస్ట్ పెట్టారు.
Also Read : Jaat : ‘జాట్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ?
‘గత కొన్ని రాత్రులు తలుచుకుంటే తెలియని భయం. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒక విధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది. మనం ఇళ్లలో నిద్రపోతున్నాము అంటే బోర్డర్‌లో ఉన్న సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం మాత్రమే కాదు, త్యాగం. అలాగే ఈ ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో, ఉద్రిక్తతతో కూడిన రాత్రి అని తన తల్లికి తెలుసు. ఇటీవలే జరిగిన మధర్స్ డే రోజు.. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికులను కని పెంచిన తల్లుల గురించి నేను ఆలోచించకుండా ఉండలేకపోయాను.
ప్రాణాలు కోల్పోయిన సైనికులను తలుచుకుని దుఃఖిస్తున్నాము. అలాగే ఈ రాత్రి నుంచి ఉద్రిక్తత తో కూడిన నిశ్శబ్దం తక్కువగా, శాంతి నుండి పుట్టిన నిశ్శబ్దం ఎక్కువగా ఉండాలని ఆశిస్తున్నాము. ప్రార్థనలు చేస్తూ, కన్నీళ్లు దిగమింగుకుంటున్న ప్రతి తల్లిదండ్రులకు ప్రేమను పంపుతున్నాము. ఎందుకంటే మీ బలం ఈ దేశాన్ని మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా కదిలిస్తుంది. మన భారతదేశం కోసం. కలిసి నిలబడదాం,. జై హింద్’ అంటూ అలియా రాసుకోచ్చింది.