కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా ఇండియాలోని చాలా థియేటర్లు మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక రాబోయే నెలల్లో విడుదల తేదీలను ప్రకటించిన భారీ బడ్జెట్ మూవీల నిర్మాతలు… ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు. బడా నిర్మాత సురేష్ బాబు కూడా తన హ్యాండ్ఓవర్‌లో ఉన్న థియేటర్లను మూసివేయాలని భావిస్తున్నట్లు ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితులను డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మూవీ ‘రాధే’ థియేటర్లతో పాటు ఓటిటి జీ5లో పే పర్ వ్యూ బేస్ లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా భారీ క్రేజ్ ఉన్న సినిమాలను కొనడానికి ప్రముఖ ఓటిటి సంస్థలు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటెర్టైనర్ ‘అఖండ’ నిర్మాతలను సంప్రదించినట్టు తెలుస్తోంది. ‘అఖండ’ డిజిటల్ విడుదలకు సదరు ఓటిటి సంస్థ రూ.65 కోట్లు ఆఫర్ చేసినట్లు వినికిడి. అయితే బాలయ్య సినిమాకు అభిమానులలో ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు ఆ ఓటిటి అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలుస్తోంది.