కొణిదెల శివశంకర్ వరప్రసాద్ నుంచి మెగాస్టార్ చిరంజీవిగా మారేందుకు మధ్యలో ఆయన పడిన కష్టం అంతాఇంతా కాదు. ఒక విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిరు అంచలంచెలుగా ఎదిగిన తీరు ఎందరికో ఇన్స్పిరేషన్. ఇప్పుడున్న సమాజంలో ఒక వ్యక్తికి పిల్లను ఇవ్వాలంటే అటెడెన్ట్ సంపాదిస్తున్నాడు.. ఎంత ఆస్తి ఉంది అని చూస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు.. కానీ అల్లు రామలింగయ్య మాత్రం చిరుకు ఆస్తి ఉందా.. అంతస్థు ఉందా అని చూడలేదంట.. అతనిలో ఉన్న పట్టుదలను, కష్టపడే తత్వాన్ని చూసి తన గారాల పట్టి సురేఖను చిరు చేతుల్లో పెట్టారట.
చిరు పెళ్లినాటికి ఆయన హీరోగా ఇంకా ఎదగలేదు. భారీ హిట్ అందుకోలేదు.. ఆ సమాయంలో అల్లు రామలింగయ్య టాప్ కమెడియన్. ఇలాంటి చిన్న హీరోకు మీ కూతురుని ఇవ్వడమేంటని అందరు రామలింగయ్యను ప్రశ్నించారట. అయినా అల్లు రామలింగయ్య వేమి పట్టించుకోకుండా 1980 ఫిబ్రవరి 20 న చిరు, సురేఖల వివాహం జరిపించారు. అయితే ఒకానొక సందర్భంలో చిరు తన పెళ్లిరోజు జరిగిన చిన్న ఇన్సిడెంట్ ని గుర్తుచేసుకోగా నేడు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆ వ్యాఖ్యలు మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి.
” నా పెళ్లి సమయానికి నేను తాతయ్య ప్రేమ లీలలు అనే సినిమాలో నటిస్తున్నాను. ఆ సమయంలో నూతన ప్రసాద్ పెద్ద ఆర్టిస్టు.. ఆయన డేట్స్ దొరకడం చాలా కష్టం. అందుకే డైరెక్టర్ ని ఇబ్బంది పెట్టకుండా పెళ్లి రోజు కూడా షూటింగ్ కి వెళ్ళాం. అయితే నా పెళ్లి అని తెలిసి నిర్మాత ఆరోజు నన్ను త్వరగా పంపించేశారు. నేను సెట్ లో ఉన్న క్యాస్టూమ్ తోనే పెళ్లి పీటలు ఎక్కాను. అప్పటికే నా బట్టలు చిరిగి ఉన్నాయి. అవి చూసి సురేఖ.. ఏంటి ఈ బట్టలు.. వెళ్లి బట్టలు మార్చుకోవచ్చుగా అని అడిగింది. ఏం బట్టలు చిరిగితే తాళి కట్టలేనా అని చెప్పి అలాగే కట్టేశాను” అని చెప్పుకొచ్చారు. మెగాస్టార్ ఊరికే కాలేదు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.