Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు చేసిన సేవలు మరువలేనివి, మరపురానివి. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన చేపట్టిన తీరు గర్వించదగ్గది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తనకు ఇంత అభిమానం ఇచ్చిన అభిమానులకు తాను తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలనే తపన నిత్యం చిరు కళ్లలో కనిపిస్తూనే ఉంటుంది. అసలు బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి కారణం ఏంటి అనేది చిరు తాజాగా చెప్పుకొచ్చారు. నేడు సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ మరియు ట్రోఫీ లాంచ్ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన చిరు మాట్లాడుతూ ” మొదట్లో నాక్కూడా పెద్ద పెద్ద బంగళాలు కట్టుకోవాలని, పెద్ద పెద్ద కార్లు కొనాలని ఉండేది. నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకోవాలని ఎంతో తాపత్రయపడేవాడిని. ఉన్నకొద్దీ నాకు అవకాశాలు, డబ్బులు రావడం మొదలయ్యాయి. కానీ తృప్తి అనేదానికి అంతం లేదనిపించింది. ఎక్కడైతే తృప్తి లేదో అక్కడ మానసిక శాంతి కూడా లభించదు. ఆ సమయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది.. ఎంతసేపు మన గురించి, మన చుట్టాల గురించి ఆలోచిస్తున్నాం కానీ నిజంగా మనం ఎవరవని చెప్పి ప్రేక్షకులు ఇంత అత్యున్నతమైన స్థానాన్ని కల్పిస్తున్నారు.
ఇంత ప్రేమను మనపై కురిపిస్తున్నారు. ఇలాంటి వారికి మనం ప్రత్యుపకారంగా ఏం చేశారు అని ఆలోచిస్తే మీరు ఏమి చేయడంలేదనే భావన కలుగుతోంది. నాకు ఆ భావం వచ్చినప్పుడు.. వీరికోసం ఏదో ఒకటి చేయాలి అనిపించి ఏ అవకాశం వచ్చినా సేవ చేయడానికి ముందు నిలబడేవాడిని. వారికి చేయూత అందించడంలో వచ్చే తృప్తి అంతా ఇంతా కాదు. ఇక బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి, పూర్తీ స్థాయిలో ఇంత ఉదృతంగా ఒక ఉద్యమంలా ఫీల్ అయ్యి పెట్టడానికి కారణం కూడా అదే.. నాకు ఇంత ఇచ్చిన ప్రేక్షకులకు నేను తిరిగి ఏం ఇస్తున్నాను అన్న ప్రశ్నలో నుంచి పుట్టుకొచ్చిందే బ్లడ్ బ్యాంక్. ఇప్పటికి అది ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్తోంది అంటే ఎంతోమంది గొప్పమనసు ఉన్నవారందరు సహకరించి నాతో పాటు ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వబట్టే అది జరిగిందని భావిస్తాను. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.