‘మా’ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయమే మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాకి మంచి మెటీరియల్ దొరికింది కదా అంటూ సెటైర్ వేయడం గమనార్హం.
లోపల సిట్యుయేషన్ చూశారు. ఎలా ఉంది ? ‘మా’ ఎలక్షన్స్ ఎప్పుడూ లేనంతగా హైప్ క్రియేట్ చేశాయి. మొదటిసారి ప్రత్యేర్థులు విమర్శలు కురిపించుకుంటున్నారు. మీరేం అంటారు ? అని ప్రశ్నించగా… చిరంజీవి మాట్లాడుతూ “అంటే ఎప్పుడూ ఒకేలాగా పరిస్థితులు ఉండవు. ఒక్కోసారి మారుతుంటాయి. దానికి అనుగుణంగా మనం కూడా సమాయత్తం అవ్వాలి” అని అన్నారు. సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ‘మా’ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఇలా ఊహించారా ? గతంలో ఇలాంటి పరిస్థితి ఉందా ? అని మీడియా ప్రశ్నించగా “మీ మీడియాకు మంచి మెటీరియల్ దొరికింది. మీరు ఆనందపడాలి కదా ఇలాంటి సిట్యుయేషన్ లో” అంటూ సెటైర్ వేసి ‘ఇలాంటివి జగకూడదు అని ఏమీ లేదు. జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. ఈరోజు అలాగే జరుగుతున్నాయి” అని చెప్పుకొచ్చారు.
Read also : శ్రీవారి సన్నిధానంలో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ
ఈసారి గెలిచే ప్యానల్ దీనిపై ఫోకస్ పెట్టాలని మీరు కోరుకుంటున్నారు ? అని ప్రశ్నించగా “తోటి కళాకారులు ఏం కోరుకుంటే అదే శిరోధార్యం. అంతేకాని మేము ఎవరినీ ప్రభావితం చేయడం లేదు” అని పేర్కొన్నారు చిరు. రెండు ప్యానళ్లకు సంబంధించిన మేనిఫెస్టో చూసి ఉంటారు. మీరు దేనికి పెద్దపీట వేస్తారు ? మీ అభిప్రాయం ఏంటి? అనే ప్రశ్నకు సమాధానంగా ‘కళాకారులు ఎవరిని ఎన్నుకుంటే వారికే నా సపోర్ట్. నేను వ్యక్తిగతంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి సమాయత్తంగా లేను. ఇలా జరగడం అంత మంచిది కాదు. కానీ భవిష్యత్తులో ఇలా జరగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాము” అని పేర్కొన్నారు. ఇక చివరగా మెగా సపోర్ట్ ఎవరికీ ? అనే ప్రశ్నకు స్పందిస్తూ “నేను నా అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి ఓటు వేశాను” అని చెప్పారు.