Chiranjeevi Reveals Why He Did GodFather: మలయాళ చిత్రం ‘లూసిఫర్’ను రీమేక్ చేయడానికి అసలు కారణం కరోనా సమయంలో ప్రేక్షకుల ఆలోచన విధానంలో వచ్చిన మార్పేనని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. గతంలో ఎస్పీ బాల సుబ్రహ్మణం వంటి పెద్దలు తనను వైవిధ్యమైన చిత్రాలు చేయమని కోరుతూ ఉండేవారని, అయితే తెలుగు ప్రేక్షకులు తన నుండి ఏమి కోరుకుంటారో తెలిసిన వ్యక్తిగా, కమర్షియల్ స్టోరీస్ వైపే తాను మొగ్గుచూపుతూ ఉండే వాడినని చిరంజీవి అన్నారు. ఇప్పుడు ‘లూసిఫర్’ లాంటి డిఫరెంట్ మూవీని చేయడానికి కారణం కరోనా సమయంలో తెలుగు ఆడియెన్స్ ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పేనని అన్నారు. హీరోయిన్ లేకుండా, పాటలు, డాన్స్ లు లేకుండా తాను ‘లూసిఫర్’ లాంటి సినిమాను చేస్తే జనం ఆదరిస్తారా? అనే సందేహం మొదట్లో కలిగిందని, ఒకానొక సమయంలో ‘లూసిఫర్’ రీమేక్ ఆలోచనను పక్కన పెట్టేశానని చెప్పారు.
అయితే… కరోనా సమయంలో వివిధ భాషలకు చెందిన చిత్రాలు చూసిన తెలుగు ప్రేక్షకులలో మార్పు బాగా వచ్చిందని, దానికి తగ్గట్టుగా మోహన రాజా బృందం నేటివిటీకి తగ్గట్టుగా ‘లూసిఫర్’ కథకు బాగా మార్పులు చేర్పులు చేశారని చిరంజీవి అన్నారు. కొన్ని పాత్రలను తొలగించడం, కొన్ని పాత్రల తీరుతెన్నులను మార్చడంతో ‘గాడ్ ఫాదర్’ మరింత మెరుగ్గా రూపుదిద్దుకుందని చెప్పారు. సత్యదేవ్ మీద తాను పెట్టుకున్న నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడని, రాబోయే రోజుల్లో తెలుగులో ప్రామిసింగ్ స్టార్స్ లో అతనూ ఒకడిగా నిలుస్తాడని చిరంజీవి కితాబిచ్చారు. అలానే లక్ష్మీ భూపాల్ మాటలూ బాగా పేలాయని అన్నారు. ‘గాడ్ ఫాదర్’కు లభిస్తున్న ఆదరణతో తెలుగు రచయితలు తన కోసం వైవిధ్యమైన కథలను తయారు చేస్తారనే నమ్మకాన్ని చిరంజీవి వెలుబుచ్చారు.