Chiranjeevi Balakrishna Pays Tribute To Superstar Krishna Demise: సూపర్‌స్టార్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది మాటలకు అందని విషాదమని చిరు తెలిపారు. కృష్ణ మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదని, ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతమని పేర్కొన్నారు. సాహసానికి ఊపరి, ధైర్యానికి పర్యాయపదమని.. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం కలబోతే కృష్ణ అని చెప్పారు. అటువంటి మమామనిసి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత చిత్రసీమలోనే అరుదని అన్నారు. సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సహసాలను ఆయన చేశారన్నారు. కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. తన సహోదరుడైన మహేశ్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు.
ఇక బాలయ్య.. కృష్ణతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. తన తండ్రి, కృష్ణ కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారన్నారు. తన నటనతో కృష్ణ చిత్రసీమలో సరికొత్త ఒరవళ్లను సృష్టించి, ఎనలేని ఖ్యాతిని సంపాదించి, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రను వేశారని కొనియాడారు. నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. కృష్ణ లేని లోటు సినీ పరిశ్రమకు, అభిమానులకు ఎప్పటికీ తీరదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఇటీవలే మాతృమూర్తి ఇందిరాదేవి, సోదరుడు రమేశ్ బాబును కోల్పోయిన తన సోదరుడు మహేశ్ బాబుకు ఈ కష్టకాలంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఓ ప్రకటన విడుదల చేశారు.
జూ. ఎన్టీఆర్ కూడా ట్విటర్ మాధ్యమంగా స్పందిస్తూ.. కృష్ణ అంటే సాహసానికి మరో పేరన్నారు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన కృష్ణ ఘనత ఎప్పటికీ చిరస్మరణీయమని కితాబిచ్చారు. ఇదే సమయంలో కళ్యాణ్ రామ్.. సూపర్ స్టార్ కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. సూపర్ స్టార్ ఫరెవర్ అని ట్వీట్ చేశారు.