Chiranjeevi Balakrishna Movies To Clash At Box Office Again: స్టార్ హీరోల సినిమాల మధ్య అప్పుడప్పుడు బాక్సాఫీస్ వద్ద క్లాష్ ఏర్పడటం సహజమే! ముఖ్యంగా.. ఫెస్టివల్ సీజన్స్‌లో ఎక్కువగా క్లాషెస్ ఏర్పడుతాయి. అయితే.. అన్ని క్లాషెస్లోకెల్లా చిరంజీవి, బాలయ్య సినిమాల క్లాష్ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమే! ఆరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హంగామా మామూలుగా ఉండదు. అభిమానులైతే థియేటర్లపై దండయాత్ర చేస్తారు. దీనికితోడు ఈ క్లాష్‌లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తికరమైన చర్చలూ జరుగుతాయి. ఇప్పుడు అలాంటి సందర్భమే మరోసారి రాబోతున్నట్టు తెలుస్తోంది.
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న మెగా154 (వాల్తేర్ వీరయ్య)ను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఆల్రెడీ మేకర్స్ వెల్లడించారు. లేటెస్ట్గా గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య చేస్తోన్న NBK107 సినిమా కూడా సంక్రాంతికే రానుందని సమాచారం. నిజానికి.. ఈ సినిమాని మొదట్లో దసరాకే రిలీజ్ చేయాలని అనుకున్నారు. అందుకు తగినట్టుగానే షూటింగ్‌ను వేగంగా నిర్వహించుకుంటూ వస్తున్నారు. అయితే, ఇంతలో బాలయ్య కరోనా బారిన పడటం వల్ల షూటింగ్ జాప్యం అయ్యింది. దీంతో, సినిమాని దసరా నుంచి డిసెంబర్‌కి షిఫ్ట్ చేశారు. గతేడాదిలో డిసెంబర్ 2న వచ్చిన ‘అఖండ’ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో.. ఆ హిట్ సెంటిమెంట్ దృష్ట్యా డిసెంబర్ 2నే NBK107ని రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ.. ఇప్పుడు డిసెంబర్ నుంచి సంక్రాంతికి సినిమాను షిఫ్ట్ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ ఎప్పట్నుంచో ఉంది. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో దాదాపు చాలావరకు విజయాలు సాధించాయి. అందుకే ఆయన సంక్రాంతికే తన చిత్రాల్ని రిలీజ్ చేస్తుంటారు. ఇప్పుడు NBK107ని కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని బాలయ్య సూచించారని, అందుకే ఆ పండగకి సినిమా రిలీజ్ వాయిదా వేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. బాక్సాఫీస్ వద్ద బాలయ్య vs చిరంజీవి పోరు ఖాయం!