Children Plays Key Role In Blockbusters: ఎన్నైనా చెప్పండి, సినిమాలకు మహారాజపోషకులు యువకులు కాదు బాలలే! యువత మహా అంటే తమకు ఇష్టమైన సినిమాను, లేదా అభిమాన హీరో చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారు. బాగుంటే మరో మారు, కాదంటే ఇంకో మారు. కానీ, బాలలు సినిమాలకు వెళ్ళాలని డిసైడ్ అయితే మాత్రం ఇంటిల్లి పాదినీ వెంట పెట్టుకు వెళతారు. దాంతో ఒక టిక్కెట్ కాదు, కనీసం మూడు టిక్కెట్లు తెగాల్సిందే. అలా లెక్కేసుకుంటూ పోతే బాలలు సినిమాలకు వస్తేనే వసూళ్ళ వర్షం కురిసేది. దీనిని దృష్టిలో పెట్టుకొనే కాబోలు మన సినిమా మొదలయినప్పటి నుంచీ తమ చిత్రాల్లో బాలలను ఆకట్టుకొనే అంశాలకు ప్రాధాన్యమిస్తున్నారు సినీజనం.
ఆరంభంలోనే…
మన తెలుగు సినిమా విషయానికే వద్దాం- మొట్టమొదటి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’. ఇందులో ప్రధాన పాత్రనే బాలునిది. 1932లో విడుదలైన ‘భక్త ప్రహ్లాద’లో బాలనటుడు కృష్ణారావు అభినయం ఆ రోజుల్లో జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో పోతన రాసిన “ఇందుగలడందు లేడని..” పద్యం అప్పట్లో తెలుగునేలపై మారుమోగింది. మరో రెండేళ్ళకు సి.పుల్లయ్య తెరకెక్కించిన ‘లవకుశ’లోనూ లవకుశులుగా నటించిన బాలల పాత్రలు, సీతగా అభినయించిన సీనియర్ శ్రీరంజని అభినయం జనాన్ని కట్టిపడేశాయి. మరుసటి యేడాది అంటే 1935లో వచ్చిన ‘శ్రీకృష్ణలీలలు’లోనూ బాలకృష్ణుని చిలిపి చేష్టలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలన్నిటినీ బ్లాక్ బస్టర్స్ అనలేం కానీ, ఆ యా సంవత్సరాల్లో మరి ఈ చిత్రాలే రాజ్యమేలాయి.
ఫస్ట్స్ … అన్నిటా…
తరువాత 1942లో బ్లాక్ బస్టర్ గా నిలచిన జెమినీ వారి ‘బాలనాగమ్మ’లో బాలవర్ధి రాజుగా నటించిన మాస్టర్ విశ్వం నటన ఆ రోజుల్లో జనాన్ని భలేగా ఆకట్టుకుంది. తెలుగునాట నేరుగా శతదినోత్సవం చూసిన చిత్రంగా ఈ ‘బాలనాగమ్మ’ నిలవడం విశేషం! ఆ మరుసటి సంవత్సరం వచ్చిన కేవీ రెడ్డి తొలి చిత్రం ‘భక్త పోతన’లో పోతన కూతురుగా నటించిన బేబీ వనజ అభినయం ప్రేక్షకులను కట్టి పడేసింది. ఇందులో ఆమెపై చిత్రీకరించిన “ఆటలాడదు వదినా…”, “మా వదిన సుకుమారి వదినా..” వంటి పాటలు ఆ రోజుల్లో జనం నోళ్ళలో నాట్యం చేశాయి. తెలుగునాట రజతోత్సవం చూసిన తొలి సినిమాగా ‘భక్త పోతన’ నిలచింది. మహానటుడు నాగయ్యకు అపూర్వ విజయాలను అందించిన ‘స్వర్గసీమ’, ‘త్యాగయ్య’ రెండు చిత్రాలలోనూ బాలల పాత్రలు విశేషమైనవే. సదరు చిత్రాల విజయాలకు దోహదపడ్డవే కావడం గమనార్హం! కేవీ రెడ్డి రెండో చిత్రం ‘గుణసుందరి కథ’లోనూ పసివాళ్ళను అలరించే అంశాలను చొప్పించారు. ఆయన దర్శకత్వంలోనే రూపొంది యన్టీఆర్ ను స్టార్ ని చేసిన ‘పాతాళభైరవి’లో బాలలను ఇట్టే కట్టిపడేసే పలు అంశాలున్నాయి. అవే ఈ నాటికీ ఆ చిత్రాన్ని అజరామరంగా నిలిపాయి. తెలుగువారి తొలి స్వర్ణోత్సవ చిత్రంగా ‘పాతాళభైరవి’ నిలచిన సంగతి తెలిసిందే! ఫిబ్రవరి 29 వతేదీ అన్నది ఓ స్పెషల్! లీపు సంవత్సరంలో మాత్రమే దర్శనమిచ్చే ఈ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలచిన చిత్రం 1952లో రూపొందిన ‘పెళ్ళిచేసి చూడు’. ఇందులో మాస్టర్ కుందు నటనతో ఆకట్టుకున్న తీరు అనితరసాధ్యం అనిపించక మానదు.
‘మాయా’ ‘సువర్ణం’!
కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మహత్తర పౌరాణికజానపదం ‘మాయాబజార్’. ఇందులోనూ చిన్నపిల్లలను ఇట్టే పట్టేసే అంశాలు బోలెడు. 1957 బ్లాక్ బస్టర్ గా ‘మాయాబజార్’ నిలవగా, అదే యేడాది విడుదలై విజయఢంకా మోగించిన ‘సువర్ణసుందరి’లోనూ మాస్టర్ బాబ్జీ నటన ప్రేక్షకులను పులకింపచేసింది. 1960 బ్లాక్ బస్టర్స్ గా నిలచిన ‘శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం’లోనూ పద్మావతి తమ్మునిగా నటించిన మాస్టర్ నాగరాజు పాత్ర మెప్పించింది. ఇక అదే యేడాది ఘన విజయం సాధించిన మరో చిత్రం ‘పెళ్ళికానుక’లోనూ పసివాడిపైనే ద్వితీయార్ధం కథ సాగడం గమనార్హం!
బాలల చుట్టూ కథలు!
తెలుగువారి తొలి రంగుల చిత్రంగా నిలచిన 1963 నాటి ‘లవకుశ’లోనూ నాటి బాలనటులు మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం నటన భలేగా ఆకట్టుకుంది. తెలుగునాట తొలి వజ్రోత్సవ చిత్రంగా ఈ ‘లవకుశ’ నిలచింది. 1966లో బ్లాక్ బస్టర్స్ గా నిలచిన ‘పరమానందయ్య శిష్యుల కథ’లో పిల్లలకు సైతం చక్కిలిగింతలు పెట్టే హాస్యం చోటు చేసుకుంది. అందువల్లే బాలలు పదే పదే ఆ చిత్రాన్ని వీక్షించారు. ఇక ‘లేత మనసులు’లో అయితే కథనే కవలపిల్లల చుట్టూ తిరగడం గమనార్హం! 1967లో సూపర్ హిట్ ‘ఉమ్మడి కుటుంబం’లోనూ చైల్డ్ సెంటిమెంట్ లేకపోలేదు. ఇక 1968 బ్లాక్ బాస్టర్ ‘రాము’ కథనే బాలుని చుట్టూ తిరుగుతుంది. 1969 సూపర్ హిట్ మూవీస్ – “కథానాయకుడు, మనుషులు మారాలి”లోనూ పాపలను అలరించే అంశాలు ఉన్నాయి. ఏయన్నార్ తొలి గోల్డెన్ జూబ్లీగా నిలచిన ‘దసరాబుల్లోడు’లోనూ చైల్డ్ సెంటిమెంట్ పండింది. తరువాతి సంవత్సరం అనగా 1972 బ్లాక్ బస్టర్ గా నిలచిన ‘పండంటి కాపురం’లోనూ పసివాళ్ళపై చిత్రీకరించిన సన్నివేశాలు జనాన్ని కట్టిపడేశాయి. తెలుగునాట తొలిసారి నాలుగు కేంద్రాలలో స్వర్ణోత్సవం చూసిన ‘అడవిరాముడు’లో అయితే అడవిలోని ముచ్చట్లు బాలలను భలేగా ఆకట్టుకున్నాయి. 1983 సూపర్ హిట్ ‘ముందడుగు’లోనూ, 1984 బ్లాక్ బస్టర్ ‘బ్రహ్మంగారి చరిత్ర’లోనూ బాలలపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను మురిపించాయి. ఇక చిరంజీవి కెరీర్ ను మరోమలుపు తిప్పిన1987 బ్లాక్ బస్టర్ ‘పసివాడి ప్రాణం’లో కథనే ఓ బాలుని చుట్టూ తిరుగుతుంది. బాలకృష్ణ కెరీర్ లో అప్పటికి బిగ్ హిట్ 1989 నాటి ‘ముద్దుల మావయ్య’లోనూ చైల్డ్ సెంటిమెంట్ ఉంది. 1990 సూపర్ హిట్ మూవీ ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’లో అయితే హీరో చుట్టూ బాలలే కనిపిస్తూ కనువిందు చేశారు. 1998లో చిరంజీవి ‘చూడాలని వుంది’లోనూ హీరో కొడుకు పాత్ర చుట్టూ కథ తిరిగి మురిపించింది.
ఆల్ టైమ్ హిట్స్ లోనూ…
“సమరసింహారెడ్డి’ (1999), కలిసుందా రా (2000), నరసింహనాయుడు (2001), ఇంద్ర (2002)” – ఈ బ్లాక్ బస్టర్స్ లోనూ చైల్డ్ సెంటిమెంట్ భలేగా చోటు చేసుకుంది. కేవలం బాలల పాత్రలను కూడా సినిమాల్లో చొప్పిస్తే చాలదు, వారిని థియేటర్లకు రప్పించడానికి ఏమేమి చేయాలి అన్న అంశాలపై దృష్టిని కేంద్రీకరించి పలు ఫాంటసీ మూవీస్ తో సినీజనం అలరించారు. రాజమౌళి తెరకెక్కించిన “మగధీర, ఈగ, బాహుబలి-1, బాహుబలి-2” చిత్రాలు సైతం ఆ కోవకే వస్తాయి. ఈ యేడాది రాజమౌళి దర్శకత్వంలో వెలుగు చూసిన ‘ట్రిపుల్ ఆర్’ కథనే ఓ పాపతో ఆరంభమవుతుంది. ప్యాండమిక్ తరువాత మొదటి బ్లాక్ బస్టర్ గా నిలచిన ‘అఖండ’లోనూ చైల్డ్ సెంటిమెంట్ ఉన్న విషయాన్ని మరువరాదు. ఇలా మన సినిమాల్లో మొదటి నుంచీ చైల్డ్ సెంటిమెంట్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. బ్లాక్ బస్టర్ కొట్టాలంటే బాలల పాత్రలు ఉండి తీరాలి అన్నది ఓ ప్రధానాంశం! అలాగే పసివాళ్ళను మళ్ళీ మళ్ళీ సినిమాలు చూసేలా చేసే అంశాలు సైతం కథలో చొప్పించాలని తేలిపోయింది. భవిష్యత్ లో మరెందరు ఈ సూత్రాన్ని అనుసరించి, అదరహో అనే అఖండ విజయాలను నమోదు చేస్తారో చూడాలి.