Butta Bomma: అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లతో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘బుట్టబొమ్మ’. ఈ మూవీతో శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గణేశ్ కుమార్ రావూరి సంభాషణలు రాస్తున్న ‘బుట్టబొమ్మ’ చిత్రానికి గోపీసుందర్ స్వర రచన చేస్తున్నాడు. ఆ మధ్య త్రివిక్రమ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. దానికి చక్కని ఆదరణ లభించింది. తాజా ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా వచ్చే యేడాది జనవరి 26న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెలిపారు. ఇందులో టైటిల్ రోల్ పోషించిన అనికా సురేంద్రన్, నాగార్జున ‘ఘోస్ట్’ మూవీలోనూ కీలక పాత్ర పోషించింది. బాలనటిగా పలు మలయాళ, తమిళ చిత్రాలలో నటించిన అనుభవం అనిక సురేంద్రన్ కు ఉంది. ఆమె హీరోయిన్ గా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే!
‘బుట్టబొమ్మ’ గురించి దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ, ”గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమ కథలో అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట తమ సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రేమలోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి” అని చెప్పారు. నవ్య స్వామి, నర్రా శ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి, ప్రేమ్ సాగర్, మిర్చి కిరణ్, ‘కేరాఫ్ కంచర పాలెం’ కిషోర్, మధుమణి తదితరులు ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.