Brahmanandam: హాస్య బ్రహ్మ, మీమ్ గాడ్, గాడ్ ఆఫ్ కామెడీ.. ఇలా లెక్కలేనన్ని పేర్లు ఆయన సొంతం. ఆయనను చూడగానే కాదు ఆయన పేరు విన్నా కూడా నవ్వొచ్చేస్తుంది. ఆయనే బ్రహ్మానందం కన్నెగంటి. బ్రహ్మీ.. జంధ్యాల వదిలిన ఒక బాణం. ఆ ఒక్కటి అడక్కు సినిమాతో ఆయనను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఆ ఒక్క సినిమా నుంచి దాదాపు 1000 సినిమాలకు పైగా ఆయన నటించేలా చేసింది. ఒక లెక్చరర్ గా మొదలైన బ్రహ్మీ కెరీర్.. సినిమాలతో కొనసాగుతూనే ఉంది. నేడు ఈ హాస్య బ్రహ్మ పుట్టినరోజు. తాజాగా ఆయన నేడు 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇక సోషల్ మీడియా మొత్తం గాడ్ ఆఫ్ కామెడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది. ఇక ఈ మధ్యనే బ్రహ్మీ.. తన ఆత్మకథను ‘నేను మీ బ్రహ్మానందమ్’ అనే పేరుతో ఒక బుక్ ద్వారా రిలీజ్ చేశారు. అందులో తన కెరీర్ లో మధురమైన అనుభూతాలను, మర్చిపోలేని ప్రశంసలను అభిమానులకు వినిపించారు. ఇక ముఖ్యంగా చిరంజీవితో ఆయన మొదటి పరిచయం ఎంతో అద్భుతంగా జరిగిందని రాసుకొచ్చారు.
” చిరంజీవితో నా పరిచయం ఒక ప్రహసనంలా జరిగింది. జంధ్యాల గారి డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా చంటబ్బాయ్ షూటింగ్ వైజాగ్ లో జరుగుతోంది. నేను కూడా జంధ్యాల గారితో కలిసి షూటింగ్ కు వెళ్లాను. అప్పటికే ఖైదీ సినిమా వచ్చి ఉండడంతో చిరంజీవిని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. వారితో కలిసి నేను కూడా సెట్స్ పై ఉన్న చిరంజీవిని చూస్తున్నాను. అప్పుడు ఆయన చార్లీ చాప్లిన్ గెటప్ లో ఉన్నారు. సడెన్ గా ఆయనను చూసి నాకు నవ్వొచ్చింది. చిరంజీవిని చూసి ఓ నవ్వు నవ్వాను.. నా నవ్వు నాకే వింతగా అనిపించింది.. చిరంజీవికి విచిత్రంగా అనిపించింది. ఇక ఆ సమయంలోనే చిరంజీవి నా వైపు చూసి.. ఎవరయ్యా ఇతను.. ఆ ఎక్స్ ప్రెషన్ ఏంటి? డిస్టర్బెన్స్ గా ఉంది.. ఇక్కడనుంచి పంపించేయండి అని అరిచారు. వెంటనే జంధ్యాల గారు జోక్యం చేసుకొని ఆయన బ్రహ్మానందం గారని, ఆర్టిస్టు. అత్తిలి కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు అని పరిచయం చేశారు. చిరంజీవి వెంటనే కుర్చీలోంచి లేచి కరచాలనం చేశారు. ఆయన ఎందుకంత పెద్ద హీరో అయ్యారో నాకప్పుడు అర్థమైంది. ఆయన నాలోని లెక్చరర్ ను గౌరవించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో నేను చిరంజీవికి ఎన్నో జోకులు చెప్పి నవ్వించాను.. నేను పెద్ద కమెడియన్ అవుతాను అని కూడా అన్నారు. షూటింగ్ అయ్యాక కూడా విశాఖలోని డాల్ఫిన్ హోటల్ కు వెళ్లి ఆయన మనసారా నవ్వుకునేలా ఎన్నో జోకులు చెప్పేవాడ్ని.. అలా చిరంజీవి ప్రేమకు పాత్రుడనయ్యాను” ఇక చంటబ్బాయ్ సినిమాలో బ్రహ్మీ ఒక చిన్న పాత్రలో కూడా కనిపిస్తాడు. ఆ తరువాత చిరు- బ్రహ్మీ కాంబోలో ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. ముందు ముందు వీరి కాంబో ఇంకా కొనసాగుతూనే ఉండాలని కోరుకుందాం.