Boycott Liger: ఇటీవల సోషల్ మీడియాలో బాలీవుడ్ సినిమాలను బాయ్ కాట్ చేయాలనే ట్రెండ్ కనిపిస్తోంది. విక్రమ్ వేద, బ్రహ్మాస్త్ర సినిమాలతో పాటు మొత్తం బాలీవుడ్‌నే బాయ్ కాట్ చేయాలని నెటిజన్‌లు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ లైగర్ మూవీని కూడా బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ మేరకు #Boycott Liger అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే దీనికి కారణం హీరో విజయ్ చేసిన కామెంట్స్, నిర్మాత కరణ్ జోహర్ అని టాక్ నడుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ఒక ఫిలిం సెట్‌లో నటుడు, నటులతో పాటు అనేకమంది పనిచేస్తారని.. ఒక సినిమా కోసం 200 నుంచి 300 మంది నటులు పని చేస్తారని.. కానీ 2వేల నుంచి 3వేల కుటుంబాల వరకు దీనివల్ల లబ్ధి పొందుతారని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాకు అనుకూలంగా మాట్లాడాడు. అమీర్ సినిమా చేస్తున్నాడంటే అతడితో పాటు ఎంతోమంది ఆ సినిమాపై ఆధారపడతారని కామెంట్ చేశాడు. బాయ్‌కాట్ ట్రెండ్ ఎందుకు జరుగుతుందో అర్ధం కావడం లేదని.. దీని వల్ల అమీర్‌ఖాన్‌నే కాకుండా మొత్తం ఎకానమీని ఎఫెక్ట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు.
తాము సినిమాలు చేస్తామని.. తమ సినిమాలను ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళే చూస్తారని.. ఎవరు చూడొద్దనుకుంటున్నారో వాళ్ళు టీవీలో, ఫోన్‌లలో చూస్తారని విజయ్ దేవరకొండ కామెంట్ చేశాడు. బాయ్‌కాట్ చేయాలనే వాళ్ల గురించి పెద్దగా మాట్లాడక పోవడం బెటర్ అంటూ వ్యాఖ్యలు చేశాడు. అయితే విజయ్ దేవరకొండ వ్యాఖ్యల్లో అతడిలో గర్వం కనిపిస్తోందని నెటిజన్‌లు మండిపడుతున్నారు. అటు లైగర్ సినిమా నిర్మాణంలో ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహర్ భాగస్వామ్యం కావడం.. హీరోయిన్ అనన్య పాండే అతడి కాంపౌండ్‌కు చెందిన వ్యక్తి కావడం కూడా నెటిజన్‌ల ఆగ్రహానికి కారణమవుతోంది. అటు ఇది తెలుగు సినిమా కాదని.. తెలుగులో డబ్బింగ్ అవుతున్న స్ట్రెయిట్ హిందీ సినిమా అంటూ కొందరు టాలీవుడ్ అభిమానులు కూడా ఈ ట్రెండ్‌కు మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.