Ramcharan Movie Shooting: ఆర్.ఆర్.ఆర్ మూవీ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో పనిచేస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ను బీజేపీ నేతలు అడ్డుకున్నారు. సరూర్ నగర్ వీఎం హోంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగా స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల తరగతులు జరుగుతున్న వేళ షూటింగులకు అనుమతి ఏ విధంగా ఇస్తారని ఆమె ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తమ స్వలాభం కోసమే విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి సినిమా షూటింగ్‌కు అనుమతి ఇచ్చారని కార్పొరేటర్ శ్రీవాణి ఆరోపించారు.
Read Also: Donation With Begging: మనుషుల్లో ఆణిముత్యం.. భిక్షాటన చేసి రూ.50 లక్షలు దానం ఇచ్చిన వృద్ధుడు
అటు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా నాణ్యత మైన విద్యను అందించాల్సిన బాధ్యత మరిచి షూటింగుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఖజానాలను నింపుకుంటుందని బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ ఆరోపించారు. వెంటనే రామ్‌చరణ్ సినిమా షూటింగు ఆపేయాలని ఆమె బిజెపి శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. సినిమా షూటింగుల కారణంగా పిల్లలకు చదువుకోవడం ఇబ్బందికరంగా మారుతుందని కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. కాగా ఆర్సీ 15 పేరుతో రామ్‌చరణ్-శంకర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.