Man Donation With Begging: మనుషులు చాలా రకాలుగా ప్రవర్తిస్తుంటారు. కొంతమంది సంపాదించింది ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడతారు. ఇతరులకు పైసా కూడా ఇవ్వరు. పిసినారిగా వ్యవహరిస్తుంటారు. మరికొందరు మాత్రం తమ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ తెగ ఖర్చు చేస్తుంటారు. అయితే తమిళనాడులోని ఓ వ్యక్తి మాత్రం తన దగ్గర డబ్బులు లేకపోయినా భిక్షాటన చేసి ఓ ప్రభుత్వ పాఠశాల కోసం విరాళం ఇచ్చాడు. ఆ విరాళం వందల్లోనో, వేలల్లోనో కాదు.. ఏకంగా లక్షల్లోనే ఉండటం గమనార్హం. ఈ మేరకు ఆ వ్యక్తి భిక్షాటన చేయగా వచ్చిన సొమ్మును ఎప్పటికప్పుడు సీఎం సహాయనిధికి అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Read Also: Biryani Packet: ఇదెక్కడి విచిత్రంరా సామీ.. అడిగితే అలా చేస్తారా..?
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు తూత్తుకుడికి చెందిన పూల్‌పాండియన్(72) భిక్షమెత్తుకుని జీవిస్తున్నాడు. అయితే అతడు బిచ్చగాడు అయినా మంచి మనసున్న వ్యక్తి. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఇప్పటివరకు రూ.55.60 లక్షలను పలు జిల్లాల కలెక్టర్లకు అందించాడు. తాజాగా సోమవారం నాడు వేలూరు కలెక్టరేట్‌లో గ్రీవెన్‌సెల్‌కు వెళ్లి తన దగ్గర ఉన్న రూ.10వేలను కలెక్టర్‌కు అందించాడు. ఈ మొత్తాన్ని శ్రీలంక తమిళులకు ఉపయోగించాలంటూ విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం శ్రీలంకలో సంక్షోభం కారణంగా అక్కడి తమిళులు అష్టకష్టాలు పడుతున్నారని.. వాళ్లకు సహాయ సహకారం అందించాలని కోరాడు. కాగా తాను పష్కరకాలంగా భిక్షాటన చేస్తున్నానని పూల్ పాండియన్ వెల్లడించాడు. అయితే తనకు వచ్చే డబ్బును ప్రజల కోసమే ఉపయోగిస్తున్నానని.. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, టేబుళ్లు కొనుగోలు చేసి ఇస్తున్నట్లు వివరించాడు.