‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ రియాలిటీ షోకు శుభం కార్డు పడింది. 83 రోజుల పాటు సాగిన ఈ షో విజేతగా నటి బిందు మాధవి నిలిచింది. ట్రోఫీతో పాటు రూ. 40 లక్షల ప్రైజ్‌మనీని ఆమె సొంతం చేసుకుంది. దీంతో తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఒక మహిళ విన్నర్‌గా నిలిచింది. ఆల్రెడీ ఓసారి రన్నరప్ దాకా వెళ్ళిన అఖిల్ సార్థక్.. ఈసారి ఓటీటీ వర్షన్‌లో ఎలాగైనా టైటిల్ గెలవాలని గట్టిగా ప్రయత్నించాడు. కానీ, అతనికి మరోసారి ఓటమి తప్పలేదు. ఈసారి కూడా రన్నరప్‌గానే నిలిచాడు.
బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో బిందు మాధవి మొదట్నుంచే దూకుడుగా ఆడుతూ.. అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. టాస్కుల్లో యాక్టివ్‌గా పాల్గొనడంతో పాటు తనదైన ఆట శైలితో అదిరిపోయే ట్విస్టులు ఇచ్చింది. తనని నామినేట్ చేసిన వారికి గట్టిగానే సమాధానం చెప్పింది. ఈమె ఇచ్చే కౌంటర్లు, యాక్టివ్‌నెస్, ఆటతీరు ఆడియన్స్‌ను అమాంతం ఆకట్టుకుంది. నటరాజ్ మాస్టర్‌తో మాటల యుద్ధం తారాస్థాయికి చేరినా.. బిందు వ్యవహరించిన తీరు ప్రేక్షకుల్ని మెప్పించింది. అలా ఒక్కో మెట్టెక్కుతూ టాప్-5కి చేరిన బిందుకి అఖిల్ సార్థక్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఎందుకంటే.. ఆల్రెడీ బిగ్‌బాస్‌లోకి వచ్చిన అఖిల్, ఆ సమయంలోనే విశేష ఆదరణ పొందాడు. ఆ తర్వాత యాంకర్‌గా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
బిందు మాధవి గురించి జనాలకి తెలుసు కానీ, అంత పాపులారిటీ అయితే లేదు. పైగా, ఇక్కడ పెద్దగా సినిమాలు చేసిందీ లేదు. దీంతో, అఖిల్‌దే పైచేయి ఉంటుందనుకున్నారు. కానీ, అనూహ్యంగా బిందు విజేతగా నిలిచింది. టైటిల్ గెలిచిన అనంతరం.. తాను తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనుకున్నానని, మళ్ళీ ఇక్కడి సినిమాల్లో నటించాలనుకుంటున్నానని, అందుకే బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో పాల్గొనేందుకు ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది. తన ట్రోఫీని లేట్ బ్లూమర్స్‌కి అంకితం చేస్తున్నానని చెప్పుకొచ్చింది. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రేక్షకులకు బిందు మాధవి ధన్యవాదాలు తెలిపింది.