ఆల్ ఇండియాలో ఒకే సారి విడుదలయ్యే చిత్రాలను ‘పాన్ ఇండియా మూవీస్’ అంటారు. నేడు తెలుగునాటనే కాదు, దక్షిణాదిన ‘పాన్ ఇండియా మూవీ’ అనే మాట విశేషంగా వినిపిస్తోంది. తెలుగులో అలాంటి చిత్రాలు ఇప్పుడే రూపొందుతున్నాయని కొందరు భ్రమిస్తున్నారు. నిజానికి తెలుగు సినిమా స్వర్ణయుగంలోనే ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్రాలు రూపొందించి, విడుదల చేసిన సంఘటనలు ఉన్నాయి. ఓ నటి తొలిసారి దర్శకత్వం వహిస్తూ 1953లోనే ‘పాన్ ఇండియా’ మూవీ తీశారు. ఆమె ఎవరో కాదు- బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి. ఆ చిత్రం ‘చండీరాణి’. అందులో భానుమతి ద్విపాత్రాభినయం చేస్తూనే గాయనిగా, నిర్మాణం, దర్శకత్వం, సంగీత పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. సినీభారతంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు భానుమతి. నటిగా, గాయనిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా భానుమతి సాగిన తీరు అనితరసాధ్యం అనిపించకమానదు.
ఈ నాటి ప్రకాశం జిల్లా దొడ్డవరంలో 1925 సెప్టెంబర్ 7న భానుమతి జన్మించారు. బాల్యం నుంచీ భానుమతి చాలా చురుగ్గా ఉండేవారు. ఇట్టే పద్యగద్యాలను అప్పచెప్పేవారు. ప్రౌఢకావ్యాలనైనా అవలీలగా వల్లించేవారు. ఇక చిన్నతనంలోనే సొంతగా రచనలు కూడా చేసేవారు.
అందుకు కారణం ఆమె తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య అనే చెప్పాలి. తన కూతురుకు బాల్యంలోనే సంగీతసాహిత్యాలలో మంచి ప్రవేశం ఉండేలా చూసుకున్నారు వెంకటసుబ్బయ్య. అంతేకాదు ఆమెకు “నువ్వు ఎందులోనూ తక్కువ కాదు” అంటూ పిన్నవయసులోనే నూరిపోశారు. దాంతో భానుమతి ఎంతటివారినైనా ధైర్యంగా ఎదుర్కొనే లక్షణం చిన్ననాడే అలవరచుకున్నారు. టీనేజ్ లో అడుగు పెట్టిందో లేదో, ఆమె గాన,నృత్య అభినయ పటిమ గురించి తెలుసుకున్న ‘వరవిక్రయం’ దర్శకులు సి.పుల్లయ్య ఆమెకు అందులో అవకాశం కల్పించారు. అలా తెరంగేట్రం చేసిన భానుమతి ఆ తరువాత మరి వెనుదిరిగి చూసుకోలేదు.
భానుమతికి బి.యన్.రెడ్డి రూపొందించిన ‘స్వర్గసీమ’ (1945) నటిగా, గాయనిగా ఎనలేని పేరును సంపాదించి పెట్టింది. అందులో భానుమతి పాడిన “ఓహో… పావురమా…” పాట అప్పట్లో తెలుగువారిని విశేషంగా అలరించింది. దర్శకుడు పి.రామకృష్ణను ఆ రోజుల్లోనే ప్రేమించి పెళ్ళాడింది భానుమతి. వారి ఏకైక సంతానం భరణి. అతని పేరుమీదే ‘భరణి స్టూడియోస్’ నిర్మించారు. భరణీ పిక్చర్స్ పతాకంపై పలు జనరంజక చిత్రాలను తెరకెక్కించారు భానుమతీ రామకృష్ణ దంపతులు. తెలుగు వారి ‘లైలా’గా అలరించిన భానుమతి ‘చింతామణి’గానూ మురిపించారు. ఇక ‘విప్రనారాయణుని’ దేవదేవిగానూ భానుమతి అభినయం జేజేలు అందుకుంది. ఎన్ని చిత్రాల్లో నటించినా భానుమతి అనగానే ఈ నాటికీ అందరికీ గుర్తుకు వచ్చే చిత్రం ‘మల్లీశ్వరి’. బి.యన్.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ కళాఖండం పాటల తోటగా తెలుగునాట నిలచింది. ఇందులోని ప్రతి పాట అమృతమే. ప్రతి మాటా సుధలొలికిస్తుంది. యన్టీఆర్, భానుమతి జోడీ తెరపై కనువిందు చేసిన తీరు కూడా అద్భుతమే. మల్లీశ్వరి పేరుతో ఎందరు తరువాతి రోజుల్లో తెరపై కనిపించినా, తెలుగువారికి ఆ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే నటీమణి భానుమతేనని చెప్పాలి. అందులో నటిగా, గాయనిగా, నర్తకిగా భానుమతి ప్రతిభను ఎవరు మరచిపోగలరు?
‘మల్లీశ్వరి’తోనే యన్టీఆర్-భానుమతి జోడీ మొదలయింది. వారిద్దరూ నటించిన “అగ్గిరాముడు, చింతామణి, వివాహబంధం, తోడు-నీడ, పల్నాటి యుద్ధం” జనాన్ని ఆకట్టుకున్నాయి. ఏయన్నార్ తో భానుమతి నటించిన “లైలా-మజ్ను, విప్రనారాయణ, ప్రేమ, చక్రపాణి” చిత్రాలు అలరించాయి. యన్టీఆర్ ‘తాతమ్మకల’లో బాలకృష్ణకు తాతమ్మగా నటించిన భానుమతి తరువాతి రోజుల్లో ‘మంగమ్మగారి మనవడు’లోనూ బాలయ్యకు నాన్నమ్మగా అభినయించారు. బాలకృష్ణ తొలి చిత్రంలో నటించడమే కాదు, ఆయన కెరీర్ లో తొలి విజయంగా నిలచిన సినిమాలోనూ భానుమతి కీలక పాత్ర పోషించడం విశేషం.
భానుమతి బహుముఖ ప్రజ్ఞకు ఎన్నో అవార్డులు, రివార్డులూ ఆమె కీర్తి కిరీటంలో నిలిచాయి. అందరూ బాలలతో ఆమె తెరకెక్కించిన ‘భక్త ధ్రువ -మార్కండేయ’ ఆ రోజుల్లో అలరించింది. ఈ చిత్రం ద్వారా నటి, నర్తకి శోభనను తెరకు పరిచయం చేశారు భానుమతి. పద్మశ్రీ,, పద్మభూషణ్ అందుకున్న భానుమతిని ఆంధ్ర, తమిళ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో గౌరవించాయి. 1985లో ఆమెకు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2000 సంవత్సరం యన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని కూడా ఆమె అందుకున్నారు. 2005 డిసెంబర్ 24న భానుమతి కన్నుమూశారు. భౌతికంగా మనమధ్య లేకపోయినా, భానుమతి స్మృతులు సదా తెలుగువారి మదిలో మెదలుతూనే ఉంటాయి.