నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే ఇటీవలే బాలయ్య భుజానికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అఖండ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక చిన్న ప్రమాదంలో ఆయన కుడిభుజంకు గాయం కావడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో ఆయనకు శస్త్ర చికిత్స జరిగిన విషయం విదితమే. ఇక తాజాగా మరోసారి బాలయ్యకు శస్త్ర చికిత్స నిర్వహించారు వైద్యులు. గత కొన్నిరోజుల నుంచి బాలకృష్ణ మోకాలి నొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది.
ఇక దీంతో మరోసారి వైద్యులు ఆయనకు మోకాళ్ల నొప్పికి శస్త్రచికిత్స చేశారని వార్తలు గుప్పుమంటున్నాయి. బాలకృష్ణ కు జరిగింది మైనర్ సర్జరీనేనని, ఆయన ఆరోగ్యం పూర్తిగా బావుందని వైద్యులు తెలిపారని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని, కొద్దిరోజులు ఇంట్లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం హాస్పిటల్ లో వైద్యులతో పాటు బాలయ్య కలిసి దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని బాలకృష్ణ సన్నిహితులు తెలపడం హాట్ టాపిక్ గా మారింది. నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి ఎటువంటి సర్జరీ జరగలేదని, ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ రోజు ఆయన సారధి స్టూడియోస్ లో #NBK107 షూటింగ్ లో పాల్గొన్నారని,
దయచేసి అవాస్తవాలను ప్రచురించవద్దు, వ్యాప్తి చేయవద్దని ప్రకటన ద్వారా తెలిపారు.