నవతరం తెలుగు సినిమా రచయితల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు బి.వి.యస్. రవి. కొందరు అతణ్ణి ‘మచ్చ’ రవిగానూ పిలుస్తూ ఉంటారు. ఎలా పిలిచినా పలికే ఈ రచయిత మాటలు కోటలు దాటేలా ఉంటాయి, నిర్మాతల మూటలు నింపేలానూ సాగుతుంటాయి. రవి రాసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, నందమూరి బాలకృష్ణ కోసం ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ షో కోసం అతను పలికించిన మాటలు ఓ ఎత్తు అని చెప్పవచ్చు. నటునిగా, రచయితగా, దర్శకునిగా, నిర్మాతగానూ సాగిన రవి అవకాశం లభిస్తే దర్శకునిగా తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నంలో ఉన్నాడు.
బి.వి.యస్.రవి 1974 జూన్ 22న విజయవాడలో జన్మించాడు. సినిమాలపై మోజుతో నచ్చినవన్నీ చూసేశాడు. వాటిలో నచ్చనివాటికి కారణాలు వెదికాడు. వాటికి ఎలాంటి నగిషీలు చెక్కాలో యోచించాడు. అప్పట్లో ఇలా సాగింది రవి బాట. ఆ ఉత్సాహంతోనే తానూ సినిమాల్లో రాణించాలని బయలు దేరాడు. ఆ రోజుల్లో రచయితగా బిజీగా ఉన్న పోసాని కృష్ణ మురళి వద్ద చేరాడు. ఆయన అసిస్టెంట్ గా పలు రచనల్లో చేయి చేసుకున్నాడు. ఆ పై కొన్ని చిత్రాలకు ఇతరుల వద్ద కూడా పనిచేశాడు. హీరో సుమంత్ కు తొలి హిట్ గా నిలచిన ‘సత్యం’ సినిమాతో బి.వి.యస్.రవికి రచయితగా మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత గోపీచంద్ ‘వాంటెడ్’తో దర్శకునిగా మెగాఫోన్ పట్టాడు రవి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. మళ్ళీ రచనతో అలరిస్తూ సాగాడు రవి. సాయిధరమ్ తేజ్ హీరోగా ‘జవాన్’ రూపొందించాడు. అదీ నిరాశ పరచింది. ధన్యా బాలకృష్ణ కీలక పాత్ర పోషించిన ‘సెకండ్ హ్యాండ్’ చిత్రనిర్మాణంలో పాలు పంచుకొని నిర్మాతగానూ మారాడు రవి.
అవన్నీ అలా ఉంచితే, నటసింహ బాలకృష్ణలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడంలో ‘అన్ స్టాపబుల్’ టాక్ షో భలేగా ఆకట్టుకుంది. ఆ షో రచనలో బి.వి.యస్.రవిదే అసలైన పాత్ర. బాలకృష్ణకే తెలియని బాలయ్య సంఘటనలు తెలుసుకొని మరీ స్క్రిప్ట్ లో పొందు పరచి రవి చేసిన రచన ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకుంది. ఈ టాక్ షో ఫస్ట్ సీజన్ అదరహో అనే రేటింగ్స్ తో సాగింది. మళ్ళీ సెకండ్ సీజన్ ఎప్పుడా అని జనం ఎదురుచూస్తున్నారు. ఈ యేడాది దసరాకు ‘ఆహా’లో అహో అనిపించేలా మళ్ళీ ‘అన్ స్టాపబుల్’ షో మొదలు కానుందని తెలుస్తోంది. మరి ఈ సారి ఏ యే గెస్ట్స్ తో రవి ఆ షోను రక్తి కట్టిస్తారో చూడాలి.