Umapathi: తమిళంలో చక్కని విజయాన్ని అందుకున్న ‘కలవాని’ చిత్రం తెలుగులో ‘ఉమాపతి’గా రీమేక్ అవుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకులకు ఓ వినూత్న అనుభూతి కలిగించేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలో కామెడీకి పెద్ద పీట వేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. క్రిషి క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటిస్తుండగా ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్ అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తోంది.
సత్య ద్వారపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కె. కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘ఫిదా’ మూవీకి సంగీతం అందించిన శక్తికాంత్ కార్తిక్ బాణీలు కడుతున్నారు. రాఘవేంద్ర కెమెరా మెన్ గా పని చేస్తుండగా స్వర్గీయ గౌతమ్ రాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా ‘ఉమాపతి’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో హీరోహీరోయిన్ లుక్ ఆకట్టుకుంటోంది. యమహా బైక్ పై పంటపొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రేమ ముచ్చట్లు జరుపుతున్నట్లు చూపించారు.
లవ్ అండ్ ఎమోషనల్ కంటెంట్ కి తోడు కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు జోడిస్తూ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా విడుదల తేదీ త్వరలోనే తెలియనుంది.