ఎవరికి ఎక్కడ ఎలా రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం! టాలెంట్ ఉన్న వారు సైతం ఒక చోట సక్సెస్ సాధిస్తే, చిత్రంగా మరోచోట ఫెయిల్ అవుతుంటారు. మరీ ముఖ్యంగా యాక్టింగ్ ఫీల్డ్ లో ఇది బాగా కనిపిస్తుంది. రంగస్థలం మీద గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న ఎంతో మంది సినిమా రంగంలోనూ తమ అదృష్టం పరీక్షించుకుని చేదు అనుభవం ఎదుర్కొన్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక ‘బుల్లితెర మీద దుమ్ము దులుపుతున్నాం కదా… వెండి తెర మీద కూడా సంచలన విజయాలను అందుకోవచ్చ’ని భారీ ఆశలతో ఆ రంగంలోకి వచ్చిన వారు కోలుకోలేని దెబ్బలు తిన్న దాఖలాలు మనకు కనిపిస్తాయి.
తాజాగా ఆ అనుభవం స్టార్ యాంకర్ సుమకు మరోసారి ఎదురైంది. పలు సీరియల్స్ లో నటించి నటిగా పేరు తెచ్చుకున్న సుమ అప్పట్లో దాసరి దర్శకత్వంలో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత వెండితెరకు నమస్కారం పెట్టేసి, బుల్లితెరపై మరింత కాన్సంట్రేషన్ చేసింది. స్టార్ యాంకర్ గానే కాదు, సినిమా వేదికలపైనా వ్యాఖ్యాతగా తన సత్తాను చాటింది. అలాంటి సుమను మరోసారి నటన అనే దోమ గట్టిగా కుట్టింది. మరో ప్రయత్నం చేస్తే తప్పులేదన్నట్టుగా ‘జయమ్మ పంచాయితీ’ మూవీలో టైటిల్ రోల్ పోషించింది. క్షణం తీరిక లేని సుమ పనికట్టుకుని తన సినిమా ప్రమోషన్స్ నిమిత్తం రెండు తెలుగు రాష్ట్రాలు చుట్టేసి వచ్చింది. కానీ ఫలితం మాత్రం ఆమెను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ సినిమా థియేటర్లలో ఇలా విడుదలై…. అలా వెళ్ళిపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో దర్శనమిస్తోంది.
సుమ తర్వాత చెప్పుకోదగ్గ మరో స్టార్ యాంకర్ అనసూయ. ఆమెకు మొదట్లో సినిమా ఆఫర్స్ వస్తే…. ససేమిరా నటించనంటూ మొండికేసింది. కానీ ఎవరి ప్రోద్భలమో చెప్పలేం కానీ కాస్తంత మనసు మార్చుకుని నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’లో ఓ పాటలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. అప్పటి నుండి తరచూ సినిమాల్లో నటిస్తూనే ఉంది. చిత్రం ఏమంటే ఆమె కీలక పాత్ర పోషించిన ‘క్షణం’ తప్పితే హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ చేసిన ‘కథనం’, ‘థ్యాంక్యూ బ్రదర్’ చిత్రాలు పత్తా లేకుండా పోయాయి. బట్ నటిగా మాత్రం ‘రంగస్థలం, పుష్ప’ వంటి సినిమాలు అనసూయకు పేరు తెచ్చిపెట్టాయి. కానీ… అనసూయతో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అంటే మాత్రం బయ్యర్లు ఆమడదూరం వెళ్ళిపోయే పరిస్థితి ఉంది.
ఇక బుల్లితెరపై తన యాంకరింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ యంగ్ యాక్టర్ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ మూవీతో హీరో అయిపోయాడు. మ్యూజికల్ గా సూపర్ హిట్ అయిన ఈ సినిమా థియేటర్లలో మాత్రం మూడు వారాలు కూడా ఆడలేకపోయింది. దాంతో తత్త్వం బోధపడిన ప్రదీప్ మళ్ళీ టీవీ షోస్ తో బిజీ అయ్యాడు. ఈ మధ్య కాలంలో నక్కతోక తొక్కి వచ్చిన వాళ్ళెవరంటే ‘జబర్దస్త్’ కమెడియన్స్ అనే చెప్పాలి. అప్పటికే సినిమాల్లో కాస్తో కూస్తో పేరు తెచ్చుకున్న వారు కొందరు, ఏ మాత్రం ముక్కూ ముఖం తెలియని వారు మరికొందరు ఈ షోలో పాల్గొని ఓవర్ నైట్ పేరు తెచ్చేసుకున్నారు. దాంతో సహజంగానే వాళ్ళకు సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి. అక్కడ కూడా కామెడీ చేస్తూ కాలం గడిపేస్తే గొడవ లేకపోను. కానీ ఆశ మనిషిని నిలకడగా ఉండనివ్వదు కదా! దాంతో సుడిగాలి సుధీర్, షకలక శంకర్ , ధనరాజ్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, ఆచంట మహేశ్, ఆటో రాంప్రసాద్, అదిరే అభి వంటి వాళ్ళు హీరోలుగా ప్రయత్నించారు. అందులో కొందరి సినిమాలు భారీ ప్రచారంతో జనం ముందుకు వచ్చాయి. కానీ హీరోలుగా వీరెవ్వరూ వెండితెరపై తమ మార్క్ ను చూపించలేకపోయారు. అయినా ఆశ చావని కొందరు ఇంకా థియేటర్ ఆడియెన్స్ ను హీరోగా మెప్పించగలమనే తాపత్రయంతో తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి వీరిలో ఎంతమంది సక్సెస్ సాధిస్తారో చూడాలి!!