గత కొన్ని రోజులుగా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా మారింది పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35 ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో చిత్రం పరిశ్రమకు చెందిన వారంతా సంతోషించారు. అయితే ఇప్పుడు వారికి షాక్ ను ఇచ్చే విధంగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. సినిమా టికెట్ ధరల జీవో రద్దుపై ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచిలో ప్రభుత్వం చేసిన అప్పీల్ లో ప్రభుత్వం తరుపు వాదనలు వినాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ఈ మేరకు లంచ్ మోషన్ ధాఖలు చేయగా, కాసేపట్లో హైకోర్టు వాదనలు విననుంది. మరి ఈ వివాదంపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.
Read Also : ఆఖరి నిమిషంలో ‘పుష్ప’రాజ్ ఆందోళన… తొలగిన అడ్డంకి
గత ఏడాది ఏప్రిల్ లో సినిమా టికెట్ ధరలను తగ్గించాలని, థియేటర్లో రోజుకు 5 షోలు కూడా వేయకూడదని నిర్ణయం తీసుకుంది. దానిని వెనక్కి తీసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు, నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు.. టికెట్ ధరలను పెంచే అధికారాన్ని థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లకు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. సినిమా టిక్కెట్ల రేట్లను తగ్గిస్తూనే, సినిమా ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రేక్షకులపై భారం మోపకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే చెబుతోంది. సామాన్యులు, ప్రేక్షకుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తోంది. తగ్గేదే లే అంటూ ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టు తీర్పును సవాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి ఈ రగడకు ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో !