మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పట్నుంచో పడిగాపులు కాస్తున్నారు. నిజానికి.. అఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పుడే మోక్షజ్ఞ తెరంగేట్రం కూడా ఉంటుందని అంతా ఆశించారు. కానీ, అది జరగలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉంటుందని బాలయ్య చెప్తూ వస్తున్నారే తప్ప, ఆ ముహూర్తం మాత్రం ఖరారు కావడం లేదు. అప్పట్లో ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో మోక్షజ్ఞ కనిపించొచ్చని టాక్ వినిపించింది కానీ, తీరా సినిమా విడుదలయ్యాక ఫ్యాన్స్ నిరాశచెందారు. కొంతకాలం తర్వాత దన దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య చెప్పారు. కానీ, ఆయనే సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. దీంతో, మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? అనే ప్రశ్న మిస్టరీగానే మిగిలిపోయింది.
అయితే.. కొన్ని రోజుల క్రితం మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతల్ని దర్శకుడు అనిల్ రావిపూడికి అప్పగించినట్టు ఓ ప్రచారం ఊపందుకుంది. అందుకు సంబంధించిన పనులు కూడా కొనసాగుతున్నాయని, త్వరలోనే అధికార ప్రకటన కూడా వెలువడనుందని టాక్ నడిచింది. దీంతో, ఎట్టకేలకు ఇన్నాళ్ళ తర్వాత తమ నిరీక్షణ తీరబోతోందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, వాళ్ళు పూర్తిగా ఆనందించేలోపే అనిల్ రావిపూడి బాంబ్ పేల్చాడు. రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను మోక్షజ్ఞను పరిచయం చేయడం లేదని కుండబద్దలు కొట్టాడు. ‘‘బాలయ్య కొడుకును నేను లాంచ్ చేయబోతున్నానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు, అవన్నీ ఫేక్’’ అని అనిల్ రావిపూడి ధృవీకరించాడు.
ఇదిలావుండగా.. ఎఫ్3 సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తోన్న అనిల్, త్వరలోనే బాలయ్యతో సినిమాని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్లనుంది. తండ్రి, కూతురి మధ్య బంధం చుట్టూ అల్లుకుని ఉండే ఈ సినిమాలో.. బాలయ్య సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు. తన కామెడీ శైలికి భిన్నంగా తాను కొత్త ప్రయోగం చేస్తున్నానని ఆల్రెడీ అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇందులో బాలయ్య కూతురిగా పెళ్లి సందD ఫేమ్ శ్రీలీలా నటిస్తోంది.