నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ మూవీ అంటే అభిమానుల అంచనాలు అంబరాన్ని తాకుతాయి. ‘అఖండ’ విషయంలోనూ అదే జరిగింది. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘సింహా’, ఆల్ టైమ్ రికార్డ్స్ ను సృష్టించిన ‘లెజెండ్’ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా నిర్మించే ఛాన్స్ ఈ సారి మిర్యాల రవీందర్ రెడ్డి దక్కించుకున్నాడు. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ భారీస్థాయిలో ‘అఖండ’ను నిర్మించి విడుదల చేశారు. బాలయ్య అభిమానుల హంగామాతో ఈ హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాకు సూపర్ ఓపెనింగ్స్ వస్తున్నాయి.
అనంతపురంకు చెందిన మురళీకృష్ణ (బాలకృష్ణ) ఫార్మర్. అంతేకాదు… అతనిలో ఓ రిఫార్మర్ కూడా ఉంటాడు. కత్తిని పట్టిన చేతులకు కలాన్ని ఇచ్చి చదువుకోమని, గొడ్డలి పట్టిన చేతికి నాగలి ఇచ్చి వ్యవసాయం చేయమని చెబుతుంటాడు. దాంతో ఆ ప్రాంతంలో ఫ్యాక్షనిజం కనుమరుగవుతుంది. ఆ జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన శార్వాణి (ప్రగ్యా జైస్వాల్)కి మురళీకృష్ణ వ్యక్తిత్వం నచ్చి అతన్ని పెళ్ళాడుతుంది. అదే ప్రాంతంలో మైనింగ్ పేరుతో యూరేనియం నిక్షేపాలను కొల్లగొట్టే వరదరాజులు (శ్రీకాంత్) కారణంగా చిన్నారుల ప్రాణాలు సంకటంలో పడతాయి. ఓ బాబా అండతో రెచ్చిపోతున్న వరద రాజులు ఆగడాలకు ఊహించని విధంగా రంగంలోకి వచ్చిన అఖండ (బాలకృష్ణ) ఎలా అడ్డుకట్టవేశాడు? ప్రకృతిని నాశనం చేసే వారి భరతం ఎలా పట్టాడు? అసలు అఖండ గతం ఏమిటీ? అనేది మిగతా కథ.
బాలకృష్ణ, బోయపాటి మార్కు చిత్రంగా ‘అఖండ’ను చెప్పుకోవచ్చు. ఎప్పటిలానే బోయపాటి ఈ సినిమాలోనూ సామాజిక అంశాన్ని ప్రధానంగా తీసుకుని కథను నడిపాడు. భూమాతను తమ స్వార్థం కోసం చెరబట్టే వ్యక్తులకు ఎప్పటికైనా కారణజన్ముల చేతిలో శిక్ష తప్పదని చూపించాడు. ‘సింహా, లెజెండ్’ చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో కథ కాస్త పలచనే! మైనింగ్ మాఫియా మీద తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే, ఈ ప్రకృతిని కొల్లగొట్టడం కోసం బాబా అవతారం ఎత్తిన ఓ ప్రతినాయకుడు, అతని అండ చూసుకుని రెచ్చిపోయే కాంట్రాక్టర్, వారి భరతం పట్టడానికి వచ్చే కారణజన్ముడు అఖండ… ఈ పాత్రలు కాస్తంత కొత్తగా ఉన్నాయి. ఇద్దరు పసిబిడ్డలకు ఓ తల్లి జన్మనిచ్చినప్పుడే ఓ సాధువు (జగపతిబాబు) వారిలో ఒకరు ప్రకృతి, మరొకరు ప్రళయం అని చెబుతాడు. కానీ పూర్తి స్థాయిలో ఆ యా లక్షణాలను దర్శకుడు ఆ పాత్రలకు అన్వయించలేదు. ఇద్దరిలోనూ సాధుగుణంతో పాటు శౌర్య గుణం ఉన్నట్టు చూపించారు. ఇక లేడీ కలెక్టర్ ఓ పోలీస్ అధికారి మీద నిఘా వేయడం కోసం పల్లెటూరి అమ్మాయిగా రంగంలోకి దిగడం కామెడీగా ఉంది. కలెక్టర్ గా బాధ్యత చేపట్టకముందే ముందుచూపుతో వ్యవహరించిన ఆమెకు అదే జిల్లాలో ప్రజలు దేవుడిగా కొలిచే వ్యక్తి గురించి ఏమీ తెలియదంటే నమ్మశక్యంగా అనిపించదు. మూడేళ్ళ పాటు యూరేనియం నిక్షేపాలను కొల్లగొడుతుంటే…. నిమ్మకు నీరెత్తినట్టు ఉండే కలెక్టర్, ఆమె తోటి అధికారులు… జరగాల్సిన డామేజ్ జరిగిన తర్వాత రిపోర్ట్ లను వెలికి తీయడం అతకలేదు. అక్కడ నుండి మురళీకృష్ణ పాత్రను పక్కన పెట్టేసి, అఖండను ఎంటర్ చేశారు.
అఖండ ఆగమనంతో మొదలైన యాక్షన్ పార్ట్ సినిమా ముగింపు వరకూ అప్రతిహతంగా సాగింది. కంటికి కనిపించే ప్రతినాయకులు ఇద్దరే! బాబాగా మారిన గజేంద్ర సాహు, వరద రాజులు. వీరిద్దరికి బుద్ధి చెప్పడం కోసం అఖండ లాంటి పాత్రను సృష్టించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే… వీరిద్దరూ కూడా మానవ మాత్రులే! వాళ్ళకేమీ అతీంద్రయశక్తులు ఉండవు. పైగా మురళీకృష్ణ గొప్ప పేరున్న వ్యక్తి కాగా, ఆయన భార్య స్వయాన కలెక్టర్. వారు పరిష్కరించలేని సమస్యలను ఎక్కడ నుండో అఖండ వచ్చి పరిష్కరించినట్టు చూపడంలో జన్యూనిటీ కనిపించదు. అయితే అఖండ పాత్రే ఈ సినిమాకు అత్యంత కీలకమైంది.
నటీనటుల విషయానికి వస్తే, బాలకృష్ణకు మురళీకృష్ణ పాత్ర కేక్ వాక్ లాంటిది. అఖండ పాత్ర కోసం మాత్రం ఆయన బాగా శ్రమించినట్టు కనిపించింది. హావభావాలు, అభినయం, యాక్షన్ సీక్వెన్స్ లో హై ఓల్టేజ్ తో ఆ పాత్రను పీక్స్ కు తీసుకెళ్ళారు. చివరిలో మదర్ సెంటిమెంట్ కంటే చైల్డ్ సెంటిమెంట్ కు పెద్ద పీట వేశారు. అవసరమైనప్పుడు తప్పకుండా తిరిగి వస్తాను అని అఖండ పాత్రతో చెప్పించడం చూస్తే దీనికి సీక్వెల్ తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదనిపిస్తోంది. కలెక్టర్ గా ప్రగ్యా జైస్వాల్ లో హుందాతనంకంటే తుంటరి తనమే కనిపించింది. ప్రభుత్వ ఉన్నతాధికారి పాత్రలో పూర్ణ మెప్పించింది. కానీ ఆమెని కొడుకు ముందు వరదరాజులు మానభంగం చేసే సన్నివేశం అసంబద్ధంగా ఉంది. కొత్తగా ఆ సమయంలో వరదరాజులు లోని క్రూరత్వాన్ని చూపించాల్సిన అవసరం లేదు. వరదరాజులు పాత్రను శ్రీకాంత్ బాగానే చేశాడు. ఆయన వాచకం కంటే ఆకారమే గంభీరంగా ఉంది. ఇతర పాత్రలలో జగపతిబాబు, నాగమహేశ్, అవినాశ్, సుబ్బరాజు, శ్రవణ్, కాలకేయ ప్రభాకర్ వంటి వారు కనిపిస్తారు.
సాంకేతిక నిపుణులలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సంగీత దర్శకుడు తమన్ గురించి. జై బాలయ్య అనే మాస్ సాంగ్ తో హీరో అభిమానులను ఆకట్టుకున్న తమన్, ‘అడిగా అడిగా…’ గీతంతో మెలోడీ ప్రియులను మెప్పించాడు. ఇక అఖండ టైటిల్ సాంగ్ సినిమాలో సందర్భానుసారంగా వచ్చి బాగుంది. మరీ ముఖ్యంగా ఆర్.ఆర్.తో సినిమాకు ఆయువుపట్టుగా నిలిచాడు తమన్. అలానే ఎం. రత్నం సంభాషణలు బాగున్నాయి. మాస్ ను అట్రాక్ట్ చేయటమే కాదు చాలా సందర్భాలలో ఆలోచన రేకెత్తించేలా ఉన్నాయి. సి. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మరో హైలైట్. యాక్షన్ సన్నివేశాలు సినిమాను పూర్తి స్థాయిలో కబ్జా చేశాయనే చెప్పాలి. మొదటి ఫైట్ సీక్వెన్స్ తో పాటు ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ పార్ట్ స్టైలిష్ గా ఉంది. కానీ ద్వితీయార్థంలో మోతాదు మించి నిడివితో నిమిత్తం లేకుండా యాక్షన్స్ సీన్స్ ఉన్నాయి. వాటిని ట్రిమ్ చేస్తే బాగుంటుందేమో! ఆ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేయడానికి కేటాయించిన సమయాన్ని, దర్శకుడు బోయపాటి కథను మరింత బలంగా తయారు చేసుకోవడానికి ఉపయోగించాల్సింది.
ఏదేమైనా… బాలకృష్ణ అభిమానుల పల్స్ తెలిసిన బోయపాటి, ఆయన్ని తెర మీద ప్రెజెంట్ చేయడంలో ఎక్కడా రాజీ పడలేదు. ప్రతి సన్నివేశాన్ని ఓ ఇంట్రడక్షన్ సీన్ అన్నట్టుగా తెరకెక్కించారు. దాంతో దాదాపు రెండేళ్ళ తర్వాత వచ్చిన బాలకృష్ణ సినిమా, నందమూరి అభిమానులకు విజువల్ ఫీస్ట్ గా మారింది. ఓ చక్కని సందేశాన్ని మాస్ ఎలిమెంట్స్ తో మిక్స్ చేసి బోయపాటి శ్రీను ‘అఖండ’గా అందించారు.
ప్లస్ పాయింట్స్
బాలకృష్ణ అభినయం
అఖండ గెటప్
తమన్ నేపథ్య సంగీతం
రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ
మైనెస్ పాయింట్
బలహీనమైన కథ
నిరాశపర్చే ద్వితీయార్థం
రేటింగ్: 2.75 / 5
ట్యాగ్ లైన్: ‘అఖండ’మైన యాక్షన్