తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసుకున్న యువ హీరోల్లో అడివి శేష్ ఒకడు. ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ, ప్రేక్షకుల మదిలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు త్వరలోనే ‘మేజర్’గా మన ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న శేష్.. సినిమాకి సంబంధించిన విశేషాలతో పాటు కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న కొన్ని పరాభావాల్ని చెప్పుకొచ్చాడు.
చందమామ సినిమాలో ముందుగా హీరోగా తననే తీసుకున్నారని, నవదీప్ స్థానంలో తాను ఉండాల్సిందని శేష్ చెప్పాడు. రెండ్రోజుల పాటు షూటింగ్ కూడా జరిగిందన్నాడు. కానీ, ఆ తర్వాత ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందని చెప్పాడు. అయితే, అందుకు గల కారణాలేంటో వెల్లడించలేదు. సొంతం సినిమాలో పెద్ద రోల్ ఉందని చెప్పి, చివరికి ఐదు సెకన్లే ఉంచారని ఆవేదన వ్యక్తం చేశాడు. అమెరికాలో హీరోగా ఎందుకు ప్రయత్నించలేదన్న ప్రశ్నకు బదులిస్తూ.. అక్కడ ఇండియన్స్ ఎవరూ హీరోలవ్వలేరని తేల్చి చెప్పాడు. టెర్రరిస్ట్ లేదా పెట్రోల్ బంక్‌లో పని చేసే పాత్రలే ఇస్తారే తప్ప.. అంతకుమించి ప్రాధాన్యమున్న రోల్స్ ఇవ్వరన్నాడు. ఇప్పటికీ.. హాలీవుడ్‌లో బాగా పేరొందిన మన ఇండియన్స్ యాక్టర్స్ కమెడియన్స్ రోల్స్‌లోనే కనిపిస్తారని తెలిపాడు.
ఇక తన లేటెస్ట్ సినిమా మేజర్ గురించి మాట్లాడుతూ.. సందీప్ ఉన్నికృష్ణన్ ఎలా చనిపోయాడో అందరికీ తెలుసని, కానీ ఎలా బతికాడనేది తెలియదని, అదే తమ సినిమా తెలియజేస్తుందన్నాడు. ఈ సినిమాకు మహేశ్‌బాబు బ్యాక్‌బోన్‌లా నిలిచారని, ఆయన వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నాడు. కాగా.. ‘మేజర్’ జూన్ 3వ తేదీన పాన్ ఇండియా సినిమాగా విడుదలకు ముస్తాబవుతోంది.