యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘అడవిరాముడు’ ఘనవిజయంతో ఆ పై ఎంతోమంది అడవి నేపథ్యంలో చిత్రాలు తెరకెక్కించారు. టైటిల్స్ లోనూ ‘అడవి’ పేరును చొప్పించారు. అలా రూపొందిన చిత్రాలలో “అడవి దొంగ, అడవి సింహాలు” వంటివి జనాన్ని అలరించాయి. ఆ కోవలో వచ్చిన చిత్రమే ‘అడవి రాజా’. శోభన్ బాబు, రాధ జంటగా నటించిన ఈ చిత్రానికి కె.మురళీమోహనరావు దర్శకత్వం వహించారు. 1986 అక్టోబర్ 31న ‘అడవిరాజా’ విడుదలయింది. నటుడు కైకాల సత్య నారాయణ సమర్పణలో ఆయన సోదరుడు కె.నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
కథ విషయానికి వస్తే – ఆంటోనీ అనే సిన్సియర్ పోలీసాఫీర్ అడవి దొంగల చేతిలో మరణిస్తాడు. అతని స్థానంలోకి రాజా వెళతాడు. అడవిలో స్మగ్లింగ్ చేస్తున్న నాయకుని కోడలు లత. ఆమెకు రాజాతో కయ్యం మొదలై, తరువాత ప్రణయంగా మారుతుంది. ఆపై పరిణయమవుతుంది. లతను ఎలాగైనా తన కోడలు చేసుకోవాలని ఆశించి ఉంటాడు స్మగ్లర్. తరువాత, రాజా, లత కాపురంలో చిచ్చు పెట్టడానికి పలు ప్రయత్నాలు చేస్తాడు. లత కన్నవారు ఆమెను కన్నెత్తి చూడరు. దాంతో గర్భవతి అయిన లతకు రాజాయే సీమంతం చేస్తాడు. రాము అనే ఏనుగు రాజా కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే తొలి నుంచీ రాజాకు ఓ కోతి కూడా నేస్తంగా ఉంటుంది. లత తండ్రి చేసిన కుయుక్తి కారణంగా రాజా కాపురం ఛిన్నాభిన్నమవుతుంది. లత, ఆమె కొడుకు బాబును తండ్రి తీసుకుపోతాడు. తరువాత రాము, కోతి వచ్చి బాబును రాజా దగ్గరకు చేరుస్తాయి. బాబును కిడ్నాప్ చేసి రాజాను లొంగదీసుకొనే ప్రయత్నం చేస్తారు దుండగులు. ఏనుగు రాము ప్రాణాలకు తెగించి కాపాడి, అసలు స్మగ్లర్ ను అంతమొందిస్తుంది. చివరకు గాయాలు నయమయ్యాక రాము రావడంతో కథ సుఖాంతమవుతుంది.
‘అడవి రాజా’లో శోభన్ బాబు, రాధ జంటగా నటించగా, సత్యనారాయణ, గిరిబాబు, నూతన్ ప్రసాద్, గొల్లపూడి మారుతీరావు, రాళ్ళపల్లి, చలపతిరావు, మాడా, వీరభద్రరావు, చిట్టిబాబు, కాకినాడ శ్యామల, శ్రీలక్ష్మి, అనూరాధ ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి సత్యానంద్ రచన చేయగా, వేటూరి పాటలు పలికించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. “అడవికి వచ్చిన ఆండాలమ్మా…”, “ఉక్కిరి బిక్కిరి నా మొగుడో…”, “మేనత్త మేనక…సొంతత్త ఊర్వశి…”, “చిలకమ్మ ఇస్తాము చిగురాకు చీర…”, “జాజిపూలు జడకు పెట్టనా…”, “నాటు మనిషిని కాదయా…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి.
‘అడవిరాజా’లో ‘అడవిరాముడు’ అనుకరణలు అనేకం కనిపిస్తాయి. ఏనుగు, కోతి చేసిన సందడి ఈ సినిమాకు జనాన్ని రప్పించగలిగాయి.