Manobala: ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు మనోబాల (69) బుధవారం చెన్నైలోని హాస్పిటల్ లో అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. 1953 డిసెంబర్ 8న జన్మించిన మనోబాల డబ్భైవ దశకంలో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. కమల్ హాసన్ సిఫార్స్ తో 1979లో ‘పుదియ వార్పుగల్’ చిత్రానికి మనోబాల అసిస్టెంట్ డైరెక్టర్ గా భారతీరాజా వద్ద వర్క్ చేశారు. స్వతహా రచయిత కూడా అయిన మనోబాల తొలి చిత్రంలోనే చిన్న పాత్రను పోషించారు. ఆ తర్వాత దర్శకత్వ శాఖలో కొనసాగుతూనే నటుడిగా భిన్నమైన పాత్రలు చేస్తూ వెళ్ళారు. ఒకానొక సమయంలో కమెడియన్ గా ఆయన తనదైన బాణీని పలికించి, తమిళ ప్రేక్షకుల హృదయసీమలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 1982లో ‘అగయ గంగై’ సినిమాతో మనోబాల దర్శకుడిగా మారారు. అక్కడ నుండి దాదాపు పాతిక పైగా చిత్రాలను రూపొందించారు. ఆయన తమిళంలో తెరకెక్కించిన ఓ సినిమానే దాసరి నారాయణరావు తెలుగులో ‘నా మొగుడు నాకే సొంతం’గా రీమేక్ చేశారు. ఈ సినిమా హిందీ, కన్నడ రీమేక్స్ కు మనోబాలే దర్శకత్వం వహించారు. అలానే మూడు సినిమాలను నిర్మించారు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో 450 సినిమాలలో నటించారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ మనోబాల నటించారు. ఆయన హఠాన్మరణంతో తమిళ చిత్రసీమలోని ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలుపుతున్నారు.