రచయిత, చిత్ర నిర్మాత కోన వెంకట్ సైతం వెబ్ సీరిస్ నిర్మాణంలోకి అడుగుపెట్టారు. జీ 5 సంస్థతో కలిసి ఆయన ‘పులి-మేక’ పేరుతో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సీరిస్ నిర్మిస్తున్నారు. ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి సుమన్, సిరి హనుమంతు, ముక్కు అవినాష్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీచంద్ హీరోగా రూపుదిద్దుకున్న ‘పంతం’ సినిమా డైరెక్టర్ కె. చక్రవర్తి రెడ్డి ఈ వెబ్ సీరిస్ కు దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన ‘పులి-మేక’ వెబ్ సీరిస్ ప్రారంభోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బాబీ క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్ చేశారు.
అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ, ”ఈ మధ్య వెబ్ సిరీస్ లు సైతం సినిమాలతో పోటీ పడుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా వెబ్ సిరీస్ లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాంతో సినిమా హీరోలు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ముందుకు వస్తున్నారు. ఈ ‘పులి – మేక’ వెబ్ సిరీస్ లో ఆది సాయికుమార్, సుమన్, లావణ్య త్రిపాఠి తదితరులు నటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇది పోలీసు డిపార్ట్‌మెంట్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ కథ. డిపార్టుమెంట్ లోని పోలీసులను టార్గెట్ చేసి ఒకరి తర్వాత ఒకరిని చంపుతున్న సీరియల్ కిల్లర్ స్టోరీ ఇది. థ్రిల్లింగ్ అంశాలతో పాటు ఆస్ట్రాలజీ మిళితమైన కథాంశం కావడం ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత” అని అన్నారు. నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్, వెంకటేశ్ కిలారుతో కలిసి కథను అందించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చుతున్నారు. దీనికి గిరిధర్ మామిడిపల్లి, కౌముది నేమాని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.