ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా విజయంతో జోష్ పెంచేశాడు. ఒకపక్క సినిమాతో బిజీగా ఉంటూనే మరోపక్క ఆహా ఓటిటీ ప్రమోషన్స్ పనులను కూడా బన్నీ తన బుజాల మీద వేసుకున్నాడు. ఆహా ఓటిటీ ని డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో మొదటి స్థానంలో నిలబెట్టేందుకు అల్లు ఫ్యామిలీ గట్టిగానే కష్టపడుతున్న సంగతి తెలిసిందే. టాక్ షో లు, కుకింగ్ షోలు, కొత్త సినిమాలు, డబ్బింగ్ సినిమాలతో ఆహా.. ఆహా అనిపిస్తోంది.
ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్ లో టాక్ షోలని ప్రారంభించి సూపర్ హిట్ చేసిన ఆహా మరో కొత్త ప్లాన్ తో సిద్ధమైపోయింది. సినిమాపురం అనే పేరుతో ప్రతి శుక్రవారం కొత్త సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమైపోయింది. దీని ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ పాల్గొనడం విశేషం. తాజాగా సినిమాపురం ప్రోమోను ఆహా మేకర్స్ రిలీజ్ చేశారు. సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూసే సినిమాలను ప్రతి శుక్రవారం ఆహా అందిస్తుందని బన్నీ చెప్పుకొచ్చాడు. ఆహాపురంలో ప్రతి శుక్రవారం .. కొత్త సినిమా.. అంటూ బన్నీ తెలిపాడు. ఆహా .. తెలుగువారి కొత్త అలవాటు అంటూ సాగిన ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.