తెలుగు చిత్రసీమలో బాపు తీతకు, ముళ్ళపూడి వెంకటరమణ రాతకు విశేషస్థానముంది. వారి జోడీ సాంఘికం తీసినా, పౌరాణికం తెరకెక్కించినా, రీమేక్స్ అందించినా జనం అభిమానించారు, ఆదరించారు. స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, పరభాషల్లో విజయం సాధించిన చిత్రాలకు తెలుగుదనం అద్ది అందించడంలోనూ బాపు-రమణ తమదైన బాణీ పలికించారు. అలా వారి అద్దకంలో వెలుగు చూసిన చిత్రాల్లో ‘రాధా కళ్యాణం’ ఒకటి. తమిళంలో భాగ్యరాజా స్వీయదర్శకత్వంలో నటించిన ‘అంద 7 నాట్కల్’ చిత్రం ఆధారంగా ఈ ‘రాధా కళ్యాణం’ తెరకెక్కింది. తెలుగువారినీ ఈ కథ అలరించింది.
‘రాధా కళ్యాణం’ కథ ఏమిటంటే- మన పురాణగాథల్లో రాధ, మాధవుడు ఎంత ప్రేయసీప్రియులైనా వారి మధ్య దూరమే ఉందని విన్నాం. అదే తీరున ఈ కథలోనూ నాయిక రాధకు, నాయకుడు పాల్ఘాట్ మాధవన్ కు మధ్య దూరమే నిలుస్తుంది. అసలు కథలోకి వస్తే – రాధ ఓ సంప్రదాయాల చాటున పెరిగిన అమ్మాయి. ఆమెకు హార్మోనియం పెట్టె పట్టుకొని మహదేవన్ లాగా సినిమా రంగాన్ని ఏలేయాలని కలలు కనే మాధవన్ పరిచయం అవుతాడు. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ, మాధవన్ ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా, వారి ప్రేమ ఫలించదు. రాధను డాక్టర్ ఆనంద్ అనే అతనికి ఇచ్చి పెళ్ళి చేస్తారు.
ఆనంద్ భార్య చనిపోయి ఉంటుంది. తల్లి బలవంతంతో రాధ మెడలో తాళి కడతాడు. పెళ్ళయిన రోజు నుంచే రాధ మనసులో ఏదో మదనం దాగుందని ఆనంద్ తెలుసుకుంటాడు. అతనికి తన ప్రేమకథ తెలుపుతుంది రాధ. మంచి మనసున్న ఆనంద్, రాధను ఆమె ప్రియునిదగ్గరకు చేర్చాలని ఆశిస్తాడు. చివరకు మాధవన్ ను పట్టుకొని వస్తాడు. మాధవన్, ఆనంద్ కట్టిన తాళిని తెంచేసి తనతో రమ్మంటాడు. ఆ పనిచేయలేకపోతుంది రాధ. అప్పుడు ఆమెకు మన సంస్కృతీసంప్రదాయాలు గుర్తుకు వస్తాయి. మాంగల్యబలం అర్థమవుతుంది. అప్పుడు రాధ, ఆనంద్ ను ఆనందంగా జీవించమని చెప్పి మాధవన్ వెళ్ళిపోవడంతో కథ ముగుస్తుంది.
ఈ కథలో రాధగా రాధిక, ఆనంద్ గా శరత్ బాబు, మాధవన్ గా చంద్రమోహన్ నటించారు. టి.ఎల్. కాంతారావు, రావి కొండలరావు, పుష్పలత, సాక్షి రంగారావు, రాధాబాయి ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రాన్ని శ్రీసారథీ స్టూడియోస్ పతాకంపై జి.డి.ప్రసాదరావు, పి.శశిభూషణ్ నిర్మించారు. భాగ్యరాజా కథకు అనువుగా తెలుగుదనం అద్ది ముళ్ళపూడి మాటలు పలికించారు. కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు. సి.నారాయణరెడ్ది పాటలు రాశారు. ఇందులోని “చిటికెయ్యవే చినదానా…”, “కలనైనా క్షణమైనా మాయనిదీ మన ప్రేమ…”, “చేతికి గాజుల్లా చెంపకు కాటుకలా…” , “బంగారు బాల పిచ్చుక…” వంటి పాటలు అలరించాయి. తెలుగువారికి బాపు ఫ్రేమ్ అంటే ఎంతో అభిమానం. ఈ చిత్రంలో రాధికను అందంగా చూపించడంలో బాపు ఫ్రేమ్ భలేగా ఆకట్టుకుంటుంది. ఇక ఆయన తనదైన పంథాలో చిత్రాన్ని తెరకెక్కించారు. ‘రాధా కళ్యాణం’ అప్పట్లో మంచి విజయం సాధించింది.