(అక్టోబర్ 10న ‘తాండ్ర పాపారాయుడు’కు 35 ఏళ్ళు)
రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ గోపీకృష్ణా మూవీస్ పతాకంపై అనేక జనరంజకమైన చిత్రాలను తెరకెక్కించారు. సొంత సంస్థ నిర్మించిన చిత్రాలతోనే కృష్ణంరాజు స్టార్ డమ్ అందుకున్నారంటే అతిశయోక్తి కాదు. “కృష్ణవేణి, భక్తకన్నప్ప, అమరదీపం, బొబ్బిలిబ్రహ్మన్న” వంటి చిత్రాలు నటునిగా కృష్ణంరాజును జనం మదిలో నిలిపాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్దేశకత్వంలో కృష్ణంరాజు సమర్పణలో రూపొందిన చిత్రం ‘తాండ్ర పాపారాయుడు’. ఈ చిత్రానికి కృష్ణంరాజు తమ్ముడు యు.వి. సూర్యనారాయణ రాజు నిర్మాతగా వ్యవహరించారు. 1986 అక్టోబర్ 10న దసరా కానుకగా వచ్చిన ‘తాండ్ర పాపారాయుడు’ జనాలను అలరించింది.
చరిత్రలో చెరిగిపోని ముద్ర వేసిన బొబ్బిలియుద్ధం నేపథ్యంలో ‘తాండ్ర పాపారాయుడు’ రూపొందింది. బొబ్బిలి సంస్థానాధీశుడు రాజా రంగారాయుడు, విజయనగర రాజు విజయరామరాజు మధ్య సత్సంబంధాలు ఉంటాయి. కోడిపుంజుల పందేలలో విజయరామరాజు ఓటమి చూసి, అప్పటి నుంచీ రంగారాయుడు, అతని జనాలపై పగ, ద్వేషం పెంచుకోవడం జరుగుతాయి. ఈ నేపథ్యంలో పరాయి దేశాల నుండి వచ్చి మనపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నవారితో చేతులు కలుపుతాడు విజయరామరాజు. బుస్సీ దొర, హైదర్ జంగ్ తో కలసి కుయుక్తులు పన్ని బొబ్బిలిని మట్టు పెట్టే ప్రయత్నం చేస్తాడు. రంగారాయుడు, అతని తమ్ముడు వెంగళరాయుడు వీరోచితంగా పోరాడి ప్రాణాలు విడుస్తారు. అప్పుడు వేరే దుర్గంలో ఉన్న రంగారాయుడు బావమరిది, బొబ్బిలి పులిగా పేరొందిన తాండ్ర పాపారాయుడు దుండగులను తుదముట్టించి, విజయరామరాజును కూడా కడతేరుస్తాడు. ఇదీ చరిత్ర చెబుతున్న కథ. దీనికి కాసిన్ని మెరుగులు అద్ది ‘తాండ్ర పాపారాయుడు’ రూపొందించారు.
యన్టీఆర్ రంగారాయుడుగా, రాజనాల విజయరామరాజుగా నటించిన ‘బొబ్బిలియుద్ధం’ 1964లో జనం ముందు నిలచింది. ఈ సినిమా తొలుత అంతగా ఆకట్టుకోక పోయినా, తరువాతి రోజుల్లో జనాన్ని విశేషంగా అలరించింది. ఇందులో తాండ్ర పాపారాయుడుగా ఎస్వీ రంగారావు నటించారు. ఆ చిత్రంలో ఎస్వీఆర్ పాత్ర నిడివి తక్కువగా ఉంటుంది. అదే పాత్ర చుట్టూ మొత్తం కథను తిప్పుతూ ఈ ‘తాండ్ర పాపారాయుడు’ రూపొందింది. చరిత్రలో ఎక్కడా కానరాని కథలు ఇందులో చొప్పించి రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. ఇందులో తన తండ్రికి మరో వివాహం చేసుకోవడం కోసం తాండ్ర పాపారాయుడుతో భీష్మునిలా ప్రతిన చేసే అంశాన్నీ చొప్పించి విడ్డూరమనిపించారు. అప్పటి దాకా పాపారాయుడును ప్రేమించిన జ్యోతిర్మయి శాశ్వత బ్రహ్మచారిణిగా మారడం ఇందులో చూస్తాం. ఈ చిత్ర కథలో చరిత్ర కొంత, కల్పితం కొండంత చోటు చేసుకుంది.
కృష్ణంరాజు తాండ్ర పాపారాయుడుగా నటించిన ఈ చిత్రంలో ఆయన ప్రేయసి జ్యోతిర్మయిగా జయప్రద నటించారు. రంగారాయుడుగా రామకృష్ణ, మల్లమ్మగా జయసుధ, బుస్సీ దొరగా ప్రాణ్, హైదర్ జంగ్ గా కోట శ్రీనివాసరావు, విజయరామరాజుగా మోహన్ బాబు అభినయించారు. మిగిలిన పాత్రల్లో గుమ్మడి, కాంతారావు, జె.వి.సోమయాజులు, ధూళిపాల, బాలయ్య, సుధాకర్, ప్రభ, అంజలీదేవి, సూర్యకాంతం, నిర్మలమ్మ, విజయలలిత, హరనాథ్ నటించారు. సీమ, జయమాలిని, సిల్క్ స్మిత నృత్యగీతాల్లో కనిపించారు. ఈ సినిమాతోనే ప్రముఖ హిందీ నటుడు ప్రాణ్ తొలిసారి తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో పనిచేసిన కృష్ణంరాజు, జయప్రద, దాసరి, సినారె, మోహన్ బాబు, సుమలత తరువాతి రోజుల్లో లోక్ సభ, రాజ్యసభకు ఎంపికయ్యారు. అలాగే ఇందులో నటించిన కోట శ్రీనివాసరావు కూడా తరువాత ఎమ్మెల్యే కావడం విశేషం.
గోపీకృష్ణామూవీస్ కథావిభాగం అందించిన కథకు కొండవీటి వెంకట కవి శ్లోకాలు, పద్యాలు, సంభాషణలు రాసి ఆకట్టుకున్నారు. ఓ.యస్.ఆర్. ఆంజనేయులు, యామినీ సరస్వతి సహరచయితలుగా వ్యవహరించారు. తెరానువాదం, దర్శకత్వం దాసరి నారాయణరావు నిర్వహించారు. సి.నారాయణ రెడ్డి, కొసరాజు, దాసరి నారాయణరావు పాటలు రాశారు. సాలూరి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు. 1964 తెరకెక్కిన ‘బొబ్బిలి యుద్ధం’ చిత్రానికి స్వరకల్పన చేసిన రాజేశ్వరరావుతోనే ఈ సినిమాకూ బాణీలు కట్టించడం విశేషం. ‘బొబ్బిలి యుద్ధం’ చిత్రం విడుదలైన 22 ఏళ్ళ తరువాత రూపొందిన ఈ చిత్రంలోనూ సాలూరి రాజేశ్వరరావు తన స్వరాలతో మధురమే పంచి, తనకు తానే సాటి అనిపించారు. ఇందులోని పాటల్లో “అభినందన మందారమాలా…” గీతం అన్నిటిలోకి అగ్రతాంబూలం అందుకొని మధురాన్ని పంచుతుంది. మిగిలిన పాటలూ అలరించాయి. ఈ చిత్రం ద్వారా ఉత్తమ మాటల రచయితగా కొండవీటి వెంకటకవికి, బెస్ట్ క్యాస్టూమ్ డిజైనర్ గా కామేశ్వరరావుకు నంది అవార్డులు లభించాయి.
1986లో దసరా కానుకలుగా వచ్చిన సినిమాలలో ఈ మూవీ ఒక్కటే చారిత్రకం. మిగిలినవన్నీ సోషల్ మూవీస్. దాంతో ఈ చిత్రం సైతం మంచి ఆదరణనే చూరగొంది.