’30 వెడ్స్ 21′ సీజన్ 2 లో చూస్తుండగానే 6వ ఎపిసోడ్ కూడా వచ్చేసింది. నిజానికి ఈ సీజన్ లో కథ కంటే కథనానికే దర్శకుడు ప్రాధాన్యం ఇస్తున్నాడు. అయితే గత ఎపిసోడ్స్ కు కాస్తంత భిన్నంగా ఈ 6వ ఎపిసోడ్ సాగింది. వ్యూవర్స్ ఊహకు చిక్కకుండా కథను డైరెక్టర్ పరుగులు తీయించాడు. ‘సారీ పృథ్వీ’ పేరుతో స్ట్రీమింగ్ అయిన ఈ ఎపిసోడ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకూ ఆసక్తికరంగా సాగింది.
లాస్ట్ ఎపిసోడ్ లో తన ప్రవర్తనతో మేఘన అలకకు కారణం అవుతాడు పృథ్వీ. అప్పటి నుండి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతుంటాడు. ఆమె మాత్రం తన పనిలో తాను పడిపోతుంది. భర్త మీద కోపం ఇసుమంతైనా తగ్గించుకోకుండా బెట్టు చేస్తూనే ఉంటుంది. మేఘన కోసం పృధ్వీ చక్కని కాఫీ కాస్తాడు, పులిహోర కలుపుతాడు. కానీ మేఘన మాత్రం కరగదు. అయితే ఆఫీస్ లో వాళ్ళ ఫస్ట్ అస్సైన్ మెంట్ కర్టెన్ రైజర్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ పార్టీకి పృథ్వీని కూడా తీసుకెళ్ళాల్సిన పరిస్థితి మేఘనకు వస్తుంది. దాంతో పృధ్వీతో మాటలు కలిపి, ‘నువ్వు కూడా పార్టీకి రావాలి’ అని చెబుతుంది. ఇదే వంకతో ఆమెకు దగ్గర కావచ్చునని, ఆమె కొలిగ్స్ తో మంచిగా ప్రవర్తించి మేఘన దగ్గర మార్కులు కొట్టేయొచ్చని పృథ్వీ ఆశపడతాడు.
కావ్య ఇంటిలో జరిగే ఆ పార్టీలో సరదా గేమ్స్ కూడా ఆడతారు. అందులో భాగంగా లవ్ మ్యారేజెస్, అరెంజ్డ్ మ్యారేజెస్ మీద లక్కీ ఓ స్థాయిలో లెక్చర్ దంచుతుంది. పృథ్వీ ఆమె అభిప్రాయాలను ఒక స్థాయి వరకూ ఖండించినా, ఆ తర్వాత మౌనం పాటిస్తాడు. ఇదే సమయంలో తమ బెటర్ హాఫ్ ను ఎవరు, ఎంత బాగా అర్థం చేసుకున్నారనే దాని మీద కూడా ఓ గేమ్ ఆడతారు. అందులో మేఘన పృధ్వీని అర్థం చేసుకున్నట్టు ఏడు పాయింట్స్ వస్తే, పృథ్వీకి మాత్రం మూడే పాయింట్స్ వస్తాయి. తన భార్యను తాను సరిగా అర్థం చేసుకోలేకపోయానని ఆత్మన్యూనతకు పృథ్వీ లోనవుతాడు. పార్టీ జరిగే సమయానికి కేక్ తెప్పించి, ముందు అనుకున్నట్టే అందరి దృష్టిలో మంచి పేరు తెచ్చుకుంటాడు. ఇక పార్టీ నుండి ఇంటికి వెళ్ళేప్పుడు పృథ్వీ మేఘన కంటే ముందు తానే సారీ చెప్పేస్తాడు. ఆమెను హర్ట్ చేశానని ఒప్పుకుంటాడు.
దానికి ముందు పార్టీలో ‘మేఘనకు పృథ్వీ మొదటిసారి ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పాడు?’ అనే ప్రశ్న ఒకటి వస్తుంది. షవర్ కింద చెప్పానని అనేసిన పృథ్వీ, ఆ తర్వాత నాలిక కరుచుకుని, నాజిల్ లో ఏదో ప్రాబ్లమ్ వస్తే… షవర్ కిందకు తానూ వెళ్ళానని సర్థి చెబుతాడు. ఆ సంఘటన జరిగి సరిగ్గా ఈ రోజుకు సంవత్సరం అయ్యిందనే విషయాన్ని మేఘన పృథ్వీకి గుర్తు చేసి, ‘ఐ లవ్ యూ’ చెబుతుంది! దాంతో గత కొద్దిరోజులుగా వారి మధ్య సాగిన మౌన యుద్ధానికి తెర పడినట్టు అయ్యింది. ఇదే సమయంలో పృథ్వీకి సింగపూర్ లో జాబ్ వచ్చిన విషయం తెలుస్తుంది. కానీ ఈ ఎపిసోడ్ లో ఆ విషయం పృధ్వీ మేఘనకు చెప్పనే లేదు. అలానే ఎపిసోడ్ చివరిలో కార్తీక్ కు ఓ మెసేజ్ వస్తుంది. అతను వెంటనే కాల్ చేస్తే అవతల వ్యక్తి ఫోన్ లో స్పందించడు. అది ఎవరి నుండి వచ్చిన మెసేజ్, ఏం మెసేజ్? అనేది దర్శకుడు సస్పెన్స్ లో ఉంచేశాడు. ఈ మధ్యకాలంలో ఇలా ఎపిసోడ్ ను కాస్తంత సస్పెన్స్ తో ఆపేయడం ఇదే! ఇక ఎదురెదురు ఫ్లాట్స్ లోనే ఉండే పృథ్వీ, కార్తీక్ ఒకే పార్టీకి వేర్వేరుగా వెళ్ళినట్టు చూపించారు. దానికి ఏదో ఒక చిన్న రీజన్ చూపించి ఉంటే బాగుండేది!
ఎప్పటిలానే చైతన్యరావ్, అనన్య చక్కగా ఆ యా పాత్రల్లో ఒదిగిపోయారు. ఈసారి లక్కీ పాత్ర చేసిన ధరణి రెడ్డికి స్క్రీన్ స్పేస్ దక్కింది. ట్రూత్ అండ్ డేర్ ఆటలో జెస్సీ, కార్తీక్ మధ్య సీన్స్ బాగున్నాయి. ఈ ఎపిసోడ్ లో ఆర్. ఆర్. మీద మరింత శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తోంది. కార్తీక్ నోటి వెంట వచ్చిన ‘సోఫా స్లీపర్ బ్యాచ్’ డైలాగ్ ఫన్నీగా ఉంది. మొత్తం మీద ఇలా మొదలై… అలా అయిపోయిన భావన ఈ ఎపిసోడ్ కలిగించింది. అంతేకాదు… కొత్త ఎపిసోడ్ కోసం ఎదురు చూసేలా చేసిందీ ‘సారీ పృథ్వీ’ కంటెంట్!