Tollywood: వరాల నిచ్చే విజయదశమి.. భక్తితో కోరుకోవాలే కానీ ఏది కావాలంటే దాన్ని మన చేతుల్లో పెట్టే దేవత.. దుర్గాదేవి. నేడు అమ్మవారికి పూజలు చేసినవారికి అనుకున్న కోరిక నెరవేరుతుందని అందరికి తెల్సిందే. ఇక టాలీవుడ్ సైతం ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజా చేసినట్లు ఉంది. ఈరోజు రిలీజ్ అయిన మూడు సినిమాలు పాజిటివ్ టాక్ ను అందుకొని విజయం వైపుగా దూసుకెళ్తున్నాయి. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో పరిస్థితిలు ఏవి బాగాలేవన్న విషయం విదితమే. దీంతో ఈ మూడు సినిమాలు ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటాయో అని అందరు ఎంతో ఆతృతగా ఎదురు చూసారు. అందరి అంచనాలను తిరగరాస్తూ మూడు సినిమాలు డీసెంట్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. కొన్ని సినిమాలతో సెప్టెంబర్ నిరాశపర్చినా అక్టోబర్ మాత్రం ఆదిలోనే శుభారంభం చేసింది. ఇక ఈ మూడు సినిమాలు గురించి ప్రేక్షకులు ఏమనుకున్నారు అంటే.. ముఖ్యంగా రీమేక్ సినిమాగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ పై ప్రేక్షకులు కొద్దిగా మిక్స్డ్ టాక్ తోనే థియేటర్స్ కు వెళ్లారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే.. రీమేక్ సినిమా.. ఆల్రెడీ చాలామంది ఈ సినిమాను చూసేశారు. ఇక ఇందులో కథను మొత్తం మారుస్తున్నట్లు మేకర్స్ చెప్పడంతో సమెగాస్టార్ సినిమా ఎలా ఉంటుందో ఆచార్య లా అయితే ఉండకూడదని భయంభయంగానే థియేటర్లో అడుగుపెట్టిన ప్రేక్షకులకు మెగా పవర్ ను చూపించి గాడ్ ఫాదర్ నిజంగానే గాడ్ ఫాదర్ అని నిరూపించాడు. థియేటర్ బయటికి వచ్చేతప్పుడు మెగా అభిమానులు కాలర్ ఎగరేయడం చూస్తుంటే అర్ధమవుతోంది ఈ సినిమా హిట్ టాక్ ను అందుకొందని.
ఇక అక్కినేని నాగార్జున.. చిరుతో పోటీ ఉన్నా కూడా సినిమాపై ఉన్న నమ్మకంతో కథపై బలంతో ఒకే రోజున రిలీజ్ చేయడానికి రెడీ అయ్యాడు. ఇక నాగ్ అలా ఆలోచించడంలో కూడా తప్పులేదని తెలుస్తోంది. కథలో బలం ఉంటే ఏ సినిమా ఎప్పుడైనా రిలీజ్ చేయవచ్చని రుజువు చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మోడ్ లో నాగ్ దిగిపోయాడు. యాక్షన్, సెంటిమెంట్ సమపాళ్లలో తీయడంలో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు విజయవంతం అయ్యినట్లు కనిపిస్తోంది. ఇక వీటితో పాటు వచ్చిన చిన్న సినిమా స్వాతి ముత్యం. కొత్త హీరో, కొత్త దర్శకుడు.. ఇద్దరు స్టార్ హీరోలు, రెండు పెద్ద సినిమాలు.. అయినా తడబడకుండా.. భయపడకుండా వాటితో పాటు పోటీలోకి దిగి నిలబడ్డాడు బెల్లంకొండ వారి చిన్నబ్బాయి బెల్లంకొండ గణేష్. సినిమా నచ్చితే చిన్నా పెద్దా, కొత్తా, పాత అని లేకుండా చూస్తారు తెలుగు అభిమానులు. ఎంతో సున్నితమైన కథకు కాస్తంత వినోదాన్ని జోడించి చివర్లో ఒక మెసెజ్ చూపించడంతో స్వాతి ముత్యం కూడా ఈ పండగ వేళ విజయాన్ని అందుకొంది. ఏదిఏమైనా పండగ వేళ మూడు సినిమాలు మంచి విజయాలను అందుకోవడం శుభ పరిమాణం అనే చెప్పాలి. అక్టోబర్ మొదటి వారంలో మంచి విజయాలను అందుకున్న టాలీవుడ్ చివరి వారంలో ఎలాంటి విజయాలను అందుకోనున్నదో చూడాలి.