25 Years Of Pelli: హీరోగా వడ్డే నవీన్ కు, నాయికగా మహేశ్వరికి, విలన్ గా పృథ్వీరాజ్ కు పేరు సంపాదించి పెట్టిన చిత్రం ‘పెళ్ళి’. శ్రీరామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎన్. రామలింగేశ్వరరావు నిర్మించిన ‘పెళ్ళి’ 1997 ఆగస్టు 8న విడుదలై ఘనవిజయం సాధించింది.
అత్తాకోడళ్ళు తల్లీకూతుళ్ళలాగా మెలిగేవారు తక్కువ సంఖ్యలో కనిపిస్తుంటారు. కోడలి భవిష్యత్ కోసం కొడుకునే విడనాడిన అత్తలు కూడా ఉంటారని గతంలో కొన్ని సినిమాలు చూపించాయి. అదే పంథాలో రూపొందిన చిత్రమే ‘పెళ్ళి’. ఇంతకూ ఈ సినిమా కథ ఏమిటంటే – నవీన్ బ్యాంక్ మేనేజర్ గా హైదరాబాద్ వస్తాడు. అతనికి ఓ బట్టలదుకాణంలో పనిచేసే మహేశ్వరి చూడగానే నచ్చేస్తుంది. ఆమెను పెళ్ళాడాలని పలు పాట్లు పడతాడు. ఆమె ఉన్న ఏరియాలోనే ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. ఆమెకు ఈ విషయం చెబితే, మహేశ్వరి తనకు పెళ్ళే ఇష్టం లేదంటుంది.
ఆ ఏరియాలోని ఇరుగు పొరుగుతో నవీన్ ఎంతో కలివిడిగా ఉంటాడు. దాంతో వారు సైతం నవీన్, మహేశ్వరి పెళ్ళాడాలనే కోరుకుంటారు. చేతనైన సాయం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందరినీ మహేశ్వరి చీదరించుకుంటుంది. ఆమెతో కూడా ఉండే అత్త జానకమ్మ కూడా పెళ్ళి చేసుకోమని చెబుతుంది. అందుకు మహేశ్వరి అంగీకరించదు. ఆమెకు గతం గుర్తుకు వస్తుంది – భర్త పెట్టిన బాధలు మెదలుతాయి. తాగితందానాలు ఆడే అతను వావివరసలు లేకుండా నడచుకొనే పద్ధతి ఆమెకు అసహ్యం కలిగిస్తుంది. వాడు చూపిన నరకానికి ఓ రోజు తట్టుకోలేకుండా బ్రాందీ సీసాతో భర్త తలపై కొడుతుంది. అతడి నుండి దూరంగా వచ్చి, అత్తాకోడలు గుట్టుగా బతుకుతూ ఉంటారు.
నవీన్ తో తన భర్తను పోల్చుకుంటుంది మహేశ్వరి. నవీన్ ను పెళ్ళాడాలని నిర్ణయించుకుంటుంది. సరిగా అదే సమయంలో తన భార్యకు వేరే వ్యక్తితో పెళ్ళవుతుంటే దీవించి పోవాలని వచ్చానని చెబుతాడు. బ్యాంక్ మేనేజర్ గా తనకు కావలసిన లోన్ ఇస్తే, వారి మధ్యకు రాననీ అంటాడు పృథ్వీ. అతను చేసే నానా యాగీ చూసిన తల్లి, పాయసంలో విషం కలిపి కన్నకొడుకుతో తాగిస్తుంది. వాడు చస్తాడు. తానూ తాగుతుంది. చివరకు నవీన్, మహేశ్వరిని ఒకటి చేసి ఆమె కన్నుమూస్తుంది. “కోడలిని కన్నకూతురిలా చూసుకొనే ప్రతి అత్తకు మా చిత్రం అంకితం” అంటూ చివరలో కార్డు వేసి ముగించారు.
నవీన్ వడ్డే, మహేశ్వరి, సుజాత, గిరిబాబు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, అనంత్, అశోక్ కుమార్, కోవై సరళ, వై.విజయ, జయలలిత నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ ను నూతన పరిచయంగా టైటిల్స్ లో ప్రకటించారు. ఒకప్పుడు బబ్లూ పేరుతోనూ పృథ్వీ బాలనటునిగా కొన్ని చిత్రాలలో నటించారు.
శ్రీనివాస చక్రవర్తి అందించిన కథకు, జి.సత్యమూర్తి మాటలు పలికించారు. ఎస్.ఏ.రాజ్ కుమార్ స్వరకల్పనకు సీతారామశాస్త్రి పాటలు రాశారు. ఇందులోని “ఓ యవ్వన వీణా…”, “రుక్కు రుక్కు రుక్కు రుక్మిణి…”, “జాబిలమ్మ నీకు అంత కోపమా…”, “అనురాగమే మంత్రంగా…”, “పైటకొంగు ఎంతోమంచిది…”, “కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాల…” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. ‘పెళ్ళి’ చిత్రం మంచి విజయం సాధించింది.
ఈ సినిమాకు ‘స్లీపింగ్ విత్ ది ఎనిమీ’ అనే 1991 నాటి చిత్రం స్ఫూర్తి అని అందరూ అంటారు. కానీ, 1977లో కె.బాలచందర్ రూపొందించిన తమిళ చిత్రం ‘అవర్గళ్’ లో సుజాత నాయికగా నటించారు. అందులో ఆమె భర్త పాత్రధారి రజనీకాంత్ ఆమెను పలు కష్టాల పాలు చేస్తాడు. గుట్టుగా ఉద్యోగం చేసుకుంటున్న ఆమెను వేధిస్తూనే ఉంటాడు. చివరకు వేరే ఊరికి బదిలీ అయిపోతే, ఆమె అత్త వచ్చి, తోడుగా నిలవడంతో కథ ముగుస్తుంది.
అందులో నాయికగా నటించిన సుజాత ఈ ‘పెళ్ళి’లో కోడలికి అండగా నిలచిన అత్తగా నటించడం విశేషం! ‘అవర్గళ్’ తెలుగులో ‘ఇది కథకాదు’ పేరుతో రూపొందింది. అదే అంశానికి మరింత కథను సమకూర్చి ఈ ‘పెళ్ళి’ కథను తయారు చేశారు శ్రీనివాస చక్రవర్తి. ఇక ‘పెళ్ళి’ కథ ఆధారంగానే తమిళంలో 1998లో ‘అవళ్ వరువాల’, 2000లో కన్నడనాట ‘మదువే’, 2002లో ‘కోయి మేరే దిల్ సే పూచే’ అనే హిందీ చిత్రం రూపొందాయి.
(ఆగస్టు 8న ‘పెళ్ళి’కి 25 ఏళ్ళు)