Winter Yoga: చలికాలంలో సాధారణంగా శరీరం బిగుసుకుపోతుంది. దీంతో కండరాల నొప్పులు వస్తుంటాయి. చలికాలంలో తగినంత సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడంతో కండరాలకు సంబంధించి కొన్ని వ్యాధులు సంభవిస్తుంటాయి. అయితే చలికాలంలో కండరాలు బిగుసుకుపోకుండా ఉండాలంటే శరీరంలో వేడిని ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు యోగాసనాలు వేయాలని వైద్యులు సూచిస్తున్నారు. యోగాసనాలు వేయడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుందని.. తద్వారా ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
వేలాది సంవత్సరాలుగా యోగా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని నిరూపించబడింది. ఈ నేపథ్యంలో యోగా చేస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. శీతాకాలంలో శరీరం ఫ్లెక్సిబులిటీగా ఉండాలంటే కొన్ని యోగా భంగిమలను ప్రతిరోజూ వేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. అలాంటి యోగాసనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పశ్చిమోత్త ఆసనం
ఈ యోగాసనంలో ముందు నేరుగా కాళ్లు చాపి కూర్చోవాలి. మీ అరికాళ్లు, పాదాలను నిటారుగా ఉంచాలి. తర్వాత నెమ్మదిగా మీ మొండెం మీ కాళ్ళకు దగ్గరగా తీసుకువెళ్లాలి. ఈ భంగిమలో వీలైనంత వరకు మీరు మీ పాదాలను పట్టుకోవడానికి మీ చేతులను ఉపయోగించవచ్చు. మీ కడుపు, ఛాతీ మీ తొడలను తాకినట్లు భావించాలి. ఇలా 10-20 సెకన్ల పాటు ఉంచి తిరిగి నిటారుగా కూర్చోవాలి. మీ సౌలభ్యాన్ని బట్టి ఈ ఆసనాన్ని పునరావృతం చేయవచ్చు
పార్శ్వోత్త ఆసనం
ఈ యోగాసనంలో ముందుగా మీ కుడి పాదాన్ని వెనక్కి ఉంచి ఎడమ పాదాన్ని ముందుకు జరపాలి. ఇప్పుడు కాళ్లను నిటారుగా ఉంచి నడుంను వంచాలి. చేతులను వెనక్కి పెట్టుకోవాలి. ఇలా 30 నుండి 60 సెకన్ల పాటు భంగిమ ఉండాలి. మీ చేతులు నేలపై లేదా ఏదైనా బల్లపై కూడా ఉంచుకోవచ్చు. ఈ ఆసనాన్ని పునరావృతం చేయాలంటే కాలు పొజిషన్ మార్చి ప్రయత్నించవచ్చు.
జాను శిరాసనం
ఈ ఆసనంలో ముందుగా యోగా మ్యాట్‌పై కూర్చోవాలి. అనంతరం మీ కుడి కాలును ముందుకు చాచి మీ ఎడమ పాదాన్ని మీ కుడి తొడ లోపల ఉంచాలి. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు మీ చేతులను గాలిలో పైకి లేపాలి. అనంతరం తుంటి వద్ద వంగి ముందుకు చాచిన కాలి వైపుకు మడవండి. కాలు లేదా పాదం లేదా మీ చేతులను నేలపై ఉంచాలి. ఈ యోగా భంగిమలో ఒక నిమిషం పాటు ఉండాలి. ఈ ఆసనాన్ని పునరావృతం చేయాలంటే కాలి పొజిషన్ మార్చండి.
ఉత్తనాసనం
ఈ ఆసనంలో నిటారుగా నిలబడాలి. అనంతరం నెమ్మదిగా ముందుకు వంగాలి. శరీరాన్ని సగం వంచి మీ అరచేతులను నేలపై ఉంచాలి. మీరు తగినంత దూరం వంగలేకపోతే మీ కాలి వేళ్లను తాకినా సరిపోతుంది. మీ చేతులను నేల వైపుకు వీలైనంత దూరం తీసుకెళ్లినా సరిపోతుంది. ఈ సమయంలో మీ ముఖం మీ కాళ్ళకు ఎదురుగా ఉండాలి. మీ తల పైభాగం నేలకు ఎదురుగా ఉండాలి.