చలి తీవ్రత పెరుగుతున్న ఈ సమయంలో ఆహారపు అలవాట్లు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చలికాలం ప్రారంభమైన వెంటనే జలుబు, దగ్గు, అలర్జీ వంటి సమస్యలు పెరుగుతుండడంతో రోజువారీ ఆహారంలో ఉపయోగించే కూరగాయల విషయంలో కూడా శ్రద్ధ వహించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సీజన్‌లో కొన్ని కూరగాయలు శరీరాన్ని అధికంగా చల్లబరచి ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రమయ్యేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వైద్యుల ప్రకారం, వంకాయ, బీరకాయ, సొరకాయ, దోసకాయ వంటి కూరగాయలు శరీరానికి ఎక్కువ చల్లదనాన్ని కలిగించేవి. చలికాలంలో ఇవి జలుబు, దగ్గు సమస్యలను పెంచే అవకాశం ఉండటంతో వీటి వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. అలాగే బెండకాయ మ్యూకస్ ఉత్పత్తిని పెంచే స్వభావం ఉండడం వల్ల ఇప్పటికే జలుబు లేదా గొంతు సమస్యలు ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. గుమ్మడికాయ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుందనే కారణంగా దీన్ని కూడా పరిమిత మోతాదులోనే తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు గంగవాల, గోంగూర వంటి కొన్ని ఆకుకూరల వినియోగాన్ని కూడా తగ్గించుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
ఇవి బదులుగా చలికాలంలో శరీరానికి సహజ వేడి ఇచ్చే క్యారెట్, బీట్‌రూట్, ముల్లంగి, మెంతికూర, వాము కూర వంటి కూరగాయలను ఆహారంలో చేర్చాలని, అలాగే అల్లం, వెల్లుల్లి వంటి ఔషధ గుణాలు ఉన్న పదార్థాలను ఉపయోగించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి అనేక ఆరోగ్య సమస్యలను ముందుగానే నివారించవచ్చని వైద్యులు తెలిపారు. సీజనల్ మార్పుల సమయంలో ఆహారపు అలవాట్లలో చిన్నచిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా శరీరాన్ని చలికాలానికి అనుగుణంగా రక్షించుకోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గమనిక: పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా అందించబడింది. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలకు సంబంధించి అవసరమైన సలహాల కోసం తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించండి.