టాటా సన్స్ చైర్మన్ రతన్ నావల్ టాటా ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. రతన్ టాటా నిజాయితీపరుడు, నైతికత, పరోపకారం కలిగిన వ్యక్తి. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా.. విజయం సాధించారు. ఆయన పెళ్లి చేసుకోలేదు. కానీ పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులకు ఆయన గొప్ప సూచనలు చేశారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు అత్యుత్తమ విద్యను అందిస్తారు. డబ్బు సంపాదించి ధనవంతులు కావడమే దీని వెనుక లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి తల్లిదండ్రులలో మీరు కూడా ఉన్నట్లయితే.. రతన్ టాటా మాటలను ఒక్కసారి చదవండి. పిల్లల పెంపకం గురించి రతన్ టాటా ఏం చెప్పారో తెలుసుకోండి…
పిల్లలకు చదువు చెప్పండి కానీ ధనవంతులు కావడానికి కాదు
ప్రతి తల్లిదండ్రులకు రతన్ టాటా ఇచ్చిన సలహా ఏమిటంటే.. “మీ పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించాలి. కానీ ధనవంతులు కావాలని కాదు. వారు సంతోషంగా ఉండేందుకు. ఇలా చేస్తే వారు పెద్దయ్యాక, వస్తువుల ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. వాటి ధర కాదు.” అని ఆయన పేర్కొన్నారు.
సరైన నిర్ణయం తీసుకోవడంలో సమయాన్ని వృథా చేయకండి
రతన్ టాటా గొప్ప వ్యాపార దిగ్గజం. ఏ నిర్ణయమైనా ఆలోచనాత్మకంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అయితే సరైన నిర్ణయం తీసుకోవడంలో రతన్ టాటా ఎప్పుడూ సమయాన్ని వృథా చేయలేదు. బదులుగా.. కొన్ని సార్లు నిర్ణయాలు తొందరగా తీసుకున్నా.. వాటిని సరిదిద్దేవారు. ప్రతి పేరెంట్ కూడా తమ పిల్లలకు త్వరగా నిర్ణయాలు తీసుకునేలా నేర్పించాలని, సరిగ్గా ఎలా చేయాలో చెప్పాలని ఆయన సూచించారు.
అవకాశాల కోసం వెతకడం పిల్లలకు నేర్పండి
“మనందరికీ ఒకే విధమైన ప్రతిభ ఉండకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి వారి ప్రతిభను పెంపొందించడానికి సమాన అవకాశాలు ఉన్నాయి. అందువల్ల, అవకాశాల కోసం వెతకడానికి పిల్లలకు నేర్పండి. తద్వారా వారి ప్రతిభకు వేదిక లభిస్తుంది.” అని రతన్‌టాటా సూచించారు.
జీవితంలో ఒడిదుడుకులు కామన్…
పిల్లలు తక్కువ మార్కులు వచ్చినప్పుడు లేదా ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఆశ కోల్పోతారు. జీవితం కొనసాగడానికి హెచ్చు తగ్గులు అవసరమని పిల్లలకు చెప్పాలని తల్లిదండ్రులకు రతన్ టాటా సూచించారు. ఎందుకంటే జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయని గుర్తుచేశారు. వాటిని ఎదుర్కొనేందుకు మీ పిల్లల్ని బలంగా తయారు చేయాలని సూచించారు.
పిల్లలను రెండు పడవల్లో ప్రయాణించనివ్వవద్దు
పిల్లలు తమ సామర్థ్యాలను ఒకే రంగంలో ఉపయోగించాలని టాటా ఎప్పుడూ చెబుతుండేవారు. తమ పిల్లలను ప్రతి రంగంలో చురుగ్గా ఉంచాలనుకునే తల్లిదండ్రులు ఎప్పుడూ నష్టాల పాలవుతున్నారు. అందువల్ల, పిల్లలను రెండు పడవల్లో నడిపించే బదులు, వారిని ఒకే రంగంలో నిపుణులుగా మార్చడం ముఖ్యమని ఆయన చెప్పేవారు.