విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర దినమే ఈ కృష్ణ జన్మాష్టమి. భక్తి, ఆనందం, సంప్రదాయం కలగలిసిన ఈ పవిత్ర వేడుకను ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఏడాది ఎంతో శ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే ఈసారి ఒక ప్రత్యేకత ఉంది.. కృష్ణ జన్మాష్టమి రెండు రోజులు జరగనుంది. ఎందుకు? పంచాంగ గణనల్లోని విశేషాలు, తిథి–నక్షత్రాల ప్రాముఖ్యత, పూజ విధానాల గురించి తెలుసుకుందాం..
2025 జన్మాష్టమి తేదీలు :
సాధారణంగా జన్మాష్టమి ఒక రోజు జరుపుకుంటారు. అయితే ఈసారి తిథి, నక్షత్రాల సమన్వయం వల్ల పండుగ రెండు రోజులకు విస్తరించింది. ద్రుక్ పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం కృష్ణ జన్మాష్టమి ఆగస్టు 15,16 తేదీల్లో జరుపుకుంటున్నారు. అష్టమి తిథి ప్రారంభం.. ఆగస్టు 15 రాత్రి 11:49 గంటల నుంచి తిథి ముగింపు ఆగస్టు 16 రాత్రి 9:34 గంటల వరకు ఉంది. అందుకే ఈ ఏడాది శ్రీకృష్ణుడి 52వ జయంతి రెండు రోజుల పండుగగా జరుపుకుంటున్నారు..
తిథి ప్రాధాన్యత:
కొందరు భక్తులు అష్టమి తిథి ప్రారంభ సమయాన్ని ముఖ్యంగా పరిగణిస్తారు. అందువల్ల ఆగస్టు 15 రాత్రే పూజలు, ఉపవాసాలు ప్రారంభిస్తారు. మరికొందరు సూర్యోదయాన ఏ తిథి ఉంటే ఆ రోజునే పండుగ జరుపుకుంటారు.
నక్షత్ర ప్రాధాన్యత:
కొందరు భక్తులు శ్రీకృష్ణుడు జన్మించిన రోహిణి నక్షత్రం సమయాన్ని ముఖ్యంగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం రోహిణి నక్షత్రం ఆగస్టు 16న రావడంతో ఆ రోజున పండుగ జరుపుకుంటారు. ఈ కారణాల వల్ల ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి రెండు రోజులు జరుపుకునే అవకాశం లభించింది. భక్తులు తమ సంప్రదాయం, సౌకర్యానికి అనుగుణంగా ఏ రోజు జరుపుకోవాలనేది నిర్ణయించుకోవచ్చు.
జన్మాష్టమి పూజ విధానం, ఆచారాలు
శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే పవిత్ర వేడుక. దేశవ్యాప్తంగా ఈ పండుగను వివిధ రీతుల్లో జరుపుకుంటారు. పూజా విధానాలు, ఆచారాలు ప్రాంతానికో రీతిలో మారినా, భక్తి, ఆనందం, ఉత్సాహం మాత్రం అందరిలో ఒకేలా కనిపిస్తాయి.
1. ఉపవాసం
ఈ రోజు ఉపవాసం అనేది ముఖ్యమైన ఆచారం. చాలామంది భక్తులు రోజంతా పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. కొందరు నీరు కూడా తాగకుండా నిర్జల ఉపవాసం పాటిస్తారు. మరికొందరు పండ్లు, పాలు మాత్రమే తీసుకుంటారు. ఉపవాసం ద్వారా శరీర శుద్ధి, మనస్సు ఏకాగ్రత సాధిస్తామని భక్తులు నమ్ముతారు.
2. ఇల్లు, దేవాలయాల అలంకరణ
జన్మాష్టమి రోజున ఇళ్లను, దేవాలయాలను పూలతో, రంగురంగుల దీపాలతో అందంగా అలంకరిస్తారు. పూలతో తయారైన తోరణాలు, రంగోలి, చిన్న కృష్ణుడి విగ్రహానికి ప్రత్యేకంగా చేసిన పూల మండపాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగిస్తాయి. పిల్లలు చిన్న కృష్ణుడి వేషధారణలో కనిపించడం ఈ పండుగకు మరింత అందాన్ని జోడిస్తుంది. ప్రతి ఇంటి ముందు కృష్ణుడు పాదాలు మాత్రం కంపల్సరి.
3. అర్ధరాత్రి ప్రత్యేక పూజలు
పంచాంగం ప్రకారం, అష్టమి తిథి రాత్రి 12 గంటల సమయంలో శ్రీకృష్ణుడి అవతారం జరిగింది. కాబట్టి ఈ సమయానికే ప్రధాన పూజలు నిర్వహిస్తారు. భక్తులు మంత్రోచ్ఛరణల మధ్య కృష్ణుడి జననాన్ని జరుపుకుంటారు. హారతులు, మంగళ వాయిద్యాల నడుమ చిన్న కృష్ణుడి విగ్రహానికి పాలు, పండ్లు, వెన్న నైవేద్యంగా సమర్పిస్తారు.
4. దహీ హండీ ఉత్సవం
మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో జన్మాష్టమి ప్రత్యేక ఆకర్షణ దహీ హండీ. ఎత్తైన ప్రదేశంలో వేలాడదీసిన పెరుగు కుండను యువకులు మానవ పిరమిడ్ నిర్మించి పగలగొడతారు. ఇది చిన్నతనంలో కృష్ణుడు వెన్న, పెరుగు దొంగిలించే క్రీడలను గుర్తు చేస్తుంది. ఈ ఉత్సవం భక్తులలో ఉత్సాహాన్ని పెంచుతుంది.
5. భజన, జపం
రోజంతా భక్తులు శ్రీకృష్ణుడి భజనలు పాడుతూ, గీత, భాగవత పురాణ పఠనం చేస్తారు. ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ వంటి మంత్రాల జపం భక్తిని మరింత పెంచుతుంది.
6. ప్రసాదం, భోజనం
పూజ పూర్తయ్యాక, ఉపవాసం ముగిసిన తర్వాత భక్తులు పాలు, పండ్లు, వెన్న, పంచామృతం, వివిధ మిఠాయిలతో తయారైన ప్రసాదాన్ని పంచుకుంటారు. ముఖ్యంగా కృష్ణయ్య కు ఎంతో ఇష్టం అయిన వెన్న మాత్రం ప్రతి ఒక్క ఇంట్లో ఈ రోజు ప్రత్యేక ప్రసాదం అని చెప్పాలి.