నాజూకైన నడుము.. ఈ తరం యువతుల మోజు! నలుగురిలో అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు.. అమ్మాయిలు సన్నగా తయారవ్వాలని కోరుకుంటారు. అందుకోసం ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ సులువైన చిట్కాలు. వీటిని తరచుగా పాటిస్తే.. అనతి కాలంలోనే మంచి రిజల్ట్‌ని పొందుతారు. అవేంటంటే..
1. తక్కువ క్యాలరీలు ఉండే ఆహార పదార్థాల్ని రోజూ తీసుకోవాలి. జంక్‌ఫుడ్, వేపుళ్లు, చాక్లెట్లు మొదలైన వాటికి స్వప్తి చెప్పి.. పండ్లు, కూరగాయలు, గుడ్లు, చేపలు వంటివి తినాలి. వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం కూడా మంచిది కాదు. లేకపోతే.. బరువు పెరగడంతో పాటు ఆయాసం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి.. సరిపడినంత మాత్రమే తినాలి.
2. మోనో అన్‌శ్యాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా లభించే గింజలు, అవకాడో వంటివి తింటే.. శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అందడంతో పాటు బరువు తగ్గే అవకాశముంది.
3. తృణధాన్యాలను తీసుకుంటే, ఇవి ఎక్కువసేపు ఆకలిని అదుపులో ఉంచుతాయి, బరువును కూడా నియంత్రణలో ఉండేలా చేస్తాయి. ప్రొటీన్లు ఎక్కువగా లభించే బీన్స్, నట్స్ వంటివి రెగ్యులర్‌గా తీసుకుంటే బెటర్.
4. ఆహారం వేగంగా తినకుండా, నెమ్మదిగా నములుతూ తినాలి. ఇలా తింటే, ఆహారం త్వరగా జీర్ణమయ్యే ఛాన్స్ ఉంది. తీసుకునే ఆహారం ఒకేసారి ఎక్కువగా కాకుండా.. కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినాలి.
5. వారానికి ఐదు రోజులు చొప్పున ప్రతిరోజూ అరగంట పాటు కార్డియో ఎక్సర్‌సైజులు చేయడం అలవాటు చేసుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం.. ఎప్పుడు వీలైతే అప్పుడు వ్యాయామం చేయడం మరచిపోవద్దు. లేదంటే ఒక్కోసారి ఎన్ని ఆహార నియమాలు పాటించినా వృథానే అవుతుంది.
6. ఉదయం నిద్ర లేచాక కనీసం 20 నిమిషాల పాటు వాకింగ్ లేదా రన్నింగ్ చేయాలి. దీనివల్ల నిద్ర మత్తు వదిలి, వ్యాయామం చేసుకోవడానికి శరీరం సహకరిస్తుంది.
7. డ్యాన్స్ చేయడం, ఈత కొట్టడం, సైక్లింగ్ వంటివి కూడా నడుముకు చక్కటి ఆకృతిని తెచ్చిపెడతాయి. కాస్త బిగుతుగా ఉండే దుస్తులు ధరించడమూ ఉత్తమమే. బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల.. బరువు పెరిగినా, తగ్గినా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.