Sleep Crisis: భారతీయులు సరిగా ‘నిద్ర’’పోవడం లేదు. ‘‘నిద్ర సంక్షోభం’’ ముంచుకొస్తుందని గ్లోబల్ స్లీప్ సర్వే తన ఐదో వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 13 మార్కెట్లలో 30,026 మందిపై అధ్యయనం నిర్వహించింది. భారతీయులు ప్రతీ వారంలో మూడు రోజులు నిద్రను కోల్పోతున్నట్లు సర్వేలో వెల్లడైంది. చాలా మంది ఈ సమస్యతో పోరాడుతున్నప్పటికీ, ఎలాంటి వైద్య సహాయం తీసుకోకపోవడం గమనార్హం. నిద్రలేమితో అలసట, ఒత్తిడిలో చిక్కుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతీ నలుగురిలో ఒకరు(22 శాతం) నిద్రలేమికి గురవుతున్నారు, వీరు ఎలాంటి సహాయం పొందడం లేదు. ఈ నిద్ర లేమి అనే అంశం వ్యక్తుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పనికి అంతరాయం కలిగిస్తోంది. మానసిక శ్రేయస్సుని దెబ్బతీస్తోంది. భారతీయుల్లో 49 శాతం మంది వారానికి కనీసం మూడు రోజులు నిద్రపోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు నివేదించింది.
పురుషులు(41.92 శాతం)తో పోలిస్తే మహిళలు(58శాతం) మంది నిద్రలేమిపై ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. శరీరానికి ఆహారం, వ్యాయామం ఎంత ముఖ్యమూ నిద్ర కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి ఆఫీసుల్లో పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
Read Also: Interfaith marriage: హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి లవ్.. జార్ఖండ్‌లో బెదిరింపులు, కేరళలో పెళ్లి..
* 47 శాతం మంది భారతీయులు, నిద్ర లేమి కారణంగా వచ్చే అలసట కారణంగా తమ కెరీర్‌లో ఒక్కసారైన సిక్ లీవ్ తీసుకుంటున్నారు.
* 80 శాతం మంది భారతీయ ఉద్యోగులు తమ బాస్‌లు నిద్ర ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 47 శాతం మంది తమ యజమానులు నిద్ర ఆరోగ్యాన్ని పట్టించుకోరని భావిస్తున్నారు.
* 37 శాతం మంది రాత్రి 09 గంటల తర్వాత రాత్రి షిఫ్టులలో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇది సహజ నిద్ర చక్రాన్ని ప్రభావితం చేస్తోంది.
* పురుషులతో పోలిస్తే స్త్రీలు తక్కువ నాణ్యమైన నిద్రను అనుభవిస్తున్నారు.
* పురుషులతో పోలిస్తే మహిళలు వారంలో తక్కువ రాత్రులు మంచి నిద్ర పొందుతున్నారు.
* స్త్రీల రుతుచక్రంపై నిద్ర తీవ్ర ప్రభావాన్ని చూపిస్తు్న్నట్లు సర్వేలో తేలింది.
* భారతదేశంలో నిద్ర లేమి కారణంగా పురుషుల(12శాతం)తో పోలిస్తే స్త్రీలు (17 శాతం) సిక్ లీవ్‌లు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
యునైటెడ్ స్టేట్స్ (5,000), చైనా (5,000), భారతదేశం (5,000), యునైటెడ్ కింగ్‌డమ్ (2,000), జర్మనీ (2,004), ఫ్రాన్స్ (2,001), ఆస్ట్రేలియా (1,501), జపాన్ (1,500), కొరియా (1,500), థాయిలాండ్ (1,519), న్యూజిలాండ్ (1,000), సింగపూర్ (1,000),హాంకాంగ్ (1,001)లలో 30,026 మంది వ్యక్తులపై నిద్ర సంక్షోభ సర్వేను నిర్వహించారు.